Jul 18,2023 10:51

బ్రస్సెల్స్‌ : వెనిజులా, క్యూబాలను కలిపి వుంచుతున్న సుహృద్భావ సంబంధాలు, సంఘీభావాన్ని ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమీక్షించారు. తమ సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరిని పునరుద్ఘాటించారు. ఇరు దేశాలపై అమెరికా విధిస్తున్న ఆంక్షలను, ఏకపక్ష బలవంతపు చర్యలను వారు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. సోమ, మంగళవారాల్లో జరుగుతున్న సెలాక్‌ (కమ్యూనిటీ ఆఫ్‌ లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ స్టేట్స్‌), (యురోపియన్‌ యూనియన్‌) ఇయుల ప్రభుత్వ, దేశాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం ఇక్కడకు వచ్చిన వెనిజులా, క్యూబా విదేశాంగ మంత్రులు వైవాన్‌ గిల్‌, బ్రూనో రొడ్రిగజ్‌లు విడిగా సమావేశమై ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. లాటిన్‌ అమెరికా దేశాలు, కరేబియా దేశాల మధ్య ఐక్యతకు గల ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు. ప్రపంచ ప్రజలకు పూర్తిగా ప్రమాదకారిగా పరిణమించిన అమెరికా గుత్తాధిపత్యాన్ని అంతం చేసేందుకు ఈ రెండూ కలిసి పెద్ద బ్లాక్‌గా ఏర్పడ్డాయని పేర్కొన్నారు. సార్వభౌమాధికార హక్కు, స్వంతంగా నిర్ణయించుకునే హక్కుల ప్రాతిపదికగా మరింత స్వేచ్ఛ, స్వాతంత్య్రాలతో కూడిన ప్రపంచం కోసం పనిచేయడానికి తమ ప్రభుత్వాలు సుముఖంగా వున్నాయని వారు చెప్పారు. ఈ సందర్భంగా క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్‌ డియాజ్‌ కానెల్‌ను వైవాన్‌ గిల్‌ అభినందించారు. ప్రజా ప్రయోజనాలకు మిత్రుడని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. సెలాక్‌, ఇయు సమావేశాలకు హాజరయ్యేందుకు వెనిజులా ఉపాధ్యక్షులు డెల్సీ రొడ్రిగజ్‌ ఆదివారమే బ్రస్సెల్స్‌ చేరుకున్నారు. సమానుల మధ్య గౌరవ సంబంధాలు వుండాలని బొలివారియన్‌ శాంతి దౌత్యం పేర్కొంటోందని రొడ్రిగజ్‌ వ్యాఖ్యానించారు.