Oct 30,2023 07:44

హవానా :   పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌ మారణహోమాన్ని క్యూబా ఖండించింది. గత మూడు వారాలుగా గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయిల్‌ చేపడుతున్న బాంబుల దాడిని క్యూబా అధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కానెల్‌ శనివారం తీవ్రంగా ఖండించారు.   ఈ మేరకు జాతీయ టెలివిజన్‌లో ఓ ప్రకటనను విడుదల చేశారు.  పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయిల్‌ ఆక్రమణ దళాల మారణహోమాన్ని, ఇళ్ల , ఆస్పత్రుల, మౌలిక సదుపాయాల ధ్వంసాన్ని తోసిపుచ్చారు. 

ఫిడెల్‌ కాస్ట్రో హయాం నుండి క్యూబా ఇటువంటి ఉగ్రవాద చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 63 ఏళ్ల క్రితం ఇజ్రాయిల్‌ ఆక్రమణను ఖండిస్తూ .. ఐరాస సాధారణ అసెంబ్లీ ఎదుట కాస్ట్రో చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. యుద్ధం ఉద్దేశం ఇతరుల సంపదను దోచుకోవడమని ఆ సమయంలో కాస్ట్రో పేర్కొన్నారని.. ఇజ్రాయిల్‌ పాలస్తీనా ప్రజలకు చెందాల్సిన వస్తువులను, భూమిని దోచుకుంటోందని మండిపడ్డారు. జాతి వివక్ష పేరుతో చిన్న భూభాగానికి పరిమితమైన పాలస్తీనియన్లు నేడు భయానక వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు.
గాజాలో నేడు కొనసాగుతున్న మానవతా విపత్తును అధ్యక్షుడు డియాజ్‌ కానెల్‌ ఖండించారు. గత మూడు వారాలుగా కొనసాగుతున్న దాడిలో మూడువేలమందికి పైగా చిన్నారులు, 1700 మంది మహిళలతో పాటు సుమారు 8,000 మందికి పైగా మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. గాజాస్ట్రిప్‌లో సుమారు 40 శాతం పైగా ఇళ్లు ధ్వంసం కాగా, ఆస్పత్రులు నెమ్మది నెమ్మదిగా పాలస్తీనియన్ల శవాగారాలుగా మారుతున్నాయని అన్నారు. 75 ఏళ్లకు పైగా ఇజ్రాయిల్‌ దళాల ఆక్రమణ, దుర్వినియోగం, బహిష్కరణ నేడు పాలస్తీనియన్‌ కుటుంబాలకు మరింత బాధ, ఆగ్రహాన్ని కలిగిస్తుందని అన్నారు.

నెతన్యాహూకి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనాలని  గాజాస్ట్రిప్‌లో కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని క్యూబా అధ్యక్షుడు అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్‌ సైన్యం గాజాలో అంతర్జాతీయ మానవతా చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించిందని, అక్కడ మారణహోమాన్ని ఆపడం అత్యవసరమని అన్నారు. ఈ సందర్భంగా నాల్గవ జెనీవా కన్వెన్షన్‌ ప్రకారం యుఎన్‌ తీర్మానాలను ఇజ్రాయిల్‌ అతిక్రమించిందని మండిపడ్డారు. ఇజ్రాయిల్‌ మరాణకాండను నిలువరించని యుఎన్‌ భద్రతా మండలిని అసమర్థతను ఖండించారు.

దేశాల మద్దతుతో ఐరాస జనరల్‌ అసెంబ్లీ తక్షణమే కాల్పుల విరమణను డిమాండ్‌ చేయడానికి ముసాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాలని క్యూబా పిలుపునిచ్చింది. పాలస్తీనా పౌరుల రక్షణ కోసం ఓ యంత్రాంగాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలని, పౌరుల తరలింపును నిలువరించాలని, అత్యవసర మానవతా సాయాన్ని పంపాలని సూచించింది.