- ఇలా తీర్మానం చేయడం ఇది వరుసగా 31వ సారి
న్యూయార్క్: క్యూబాపై అమెరికా అక్రమ దిగ్బంధనాన్ని తొలగించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానాన్ని అత్యధిక మెజార్టీతో బుధవారం ఆమోదించింది. 63 ఏళ్లుగా ఈ చిన్ని సోషలిస్టు ద్వీప దేశంపై కొనసాగిస్తున్న దిగ్బంధనానికి స్వస్తి పలకాలని కోరుతున్న తీర్మానానికి అనుకూలంగా 187 దేశాలు ఓటు వేయగా, కేవలం రెండే రెండు దేశాలు (అమెరికా, ఇజ్రాయిల్) దీనిని వ్యతిరేకించాయి. ఉక్రెయిన్ ఓటింగ్‌కు గైర్హాజరైంది. అమెరికా దిగ్బంధనానికి వ్యతిరేకంగా ఐరాస తీర్మానం చేయడం వరుసగా ఇది 31వ సారి. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రొడ్రిగజ్ పెరిల్లా మాట్లాడుతూ, క్యూబాపై అమెరికా ఆర్థిక యుద్ధం సాగిస్తోందని, దాని ఒత్తిళ్లకు లొంగి తృతీయ దేశాల్లో బ్యాంకులు కూడా క్యూబాతో వ్యాపారానికి భయపడుతున్నాయని అన్నారు. లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల తరపు ప్రతినిధి ఇంగా రోద్నా కింగ్ మాట్లాడుతూ, క్యూబాను ఉగ్రవాద దేశాల జాబితాలో చేర్చి అమెరికా కొనసాగిస్తున్న ఆంక్షలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఐరాసలో వెనిజులా రాయబారి మెనిసా రాంబల్లి మాట్లాడుతూ,అమెరికా విధించిన ఈ ఆర్థిక దిగ్బంధనం ఐరాస నియమావళికి పూర్తి విరుద్ధమన్నారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న క్యూబా సాలిడారిటీ క్యాంపెయిన్ మద్దతుదారులు బ్రిటన్‌లోని అమెరికా రాయబారికి ఒక లేఖ రాస్తూ, క్యూబాపై దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని, ఉగ్రవాద దేశాల జాబితా నుంచి క్యూబా పేరును తొలగించాలని డిమాండ్ చేశారు. ఐరాస జనరల్ అసెంబ్లీల్లో క్యూబాకు మద్దతుగా నిలిచిన అంతర్జాతీయ సమాజానికి క్యూబా విదేశాంగ మంత్రి రొడ్రిగజ్ కృతజ్ఞతలు తెలిపారు.