వాషింగ్టన్ : వెనిజులాలోని కొన్ని పరిశ్రమలపై విధించిన ఆంక్షలను ఆరు మాసాలపాటూ సడలిస్తూ అమెరికా ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. వెనిజులా ఇంధన పరిశ్రమకు బుధవారం అమెరికా ఆర్థిక శాఖ తాత్కాలిక ఉపశమనాన్ని ప్రకటించడంతో మరింత పునరుత్తేజంతో చమురు, గ్యాస్ మార్కెట్‌లోకి దేశం ప్రవేశిస్తోందని అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రకటించారు. ఎంపిక చేసిన రంగాలపై నిర్దిష్ట ఆంక్షలను నిలుపుచేస్తూ నాలుగు జనరల్ లైసెన్స్‌లను జారీ చేశారు. వెనిజులా ప్రభుత్వం, బార్బడోస్‌లో ప్రతిపక్షం మధ్య కుదిరిన ఎన్నికల ప్రణాళికకు ప్రతిస్పందనగా ఈ ప్రకటన వెలువడింది. ఈ ఒప్పందాలు, నిర్ణయాలతో చమురు, గ్యాస్ మార్కెట్‌లో ప్రగతిశీలమైన పద్ధతిలో ప్రవేశిస్తున్నామని మదురో తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారో దాన్ని బట్టి లైసెన్సుల పునరుద్ధరణ వుంటుందని ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది.