కారకాస్ : పరస్పర సహకారం అందించుకునేలా వెనిజులా, బొలీవియా దేశాలు 13 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. చమురు, గ్యాస్, మైనింగ్, విద్య, ఆరోగ్యం, వైమానిక సంబంధాలు, సాంస్కృతిక రంగంతో పాటు పలు రంగాల్లో సహకారం అందిపుచ్చుకునేలా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, బొలీవియన్ అధ్యక్షుడు లూయిస్ ఆర్స్‌లు గురువారం 13 ఒప్పందాలపై సంతకాలు చేశారు. 1883 నుండి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొన్నాయి.
అనంతరం కారకాస్‌లోని అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్ ప్యాలెస్‌లో ఇరువురు అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. ఈ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక మైత్రిని మరింత బలోపేతం చేస్తాయని ప్రకటించారు. మూడవ బొలీవియా-వెనిజులా విలీన సదస్సు ముగింపు సమావేశంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు తమ దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణను సూచిస్తాయని లూయిస్ ఆర్స్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్ గురువారం ఉదయం కారకాస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మదురో బొలీవియా అధ్యక్షుడు ఆర్స్‌కి లిబరేటర్ సైమన్ బొలివర్ కత్తి ప్రతిరూపాన్ని బహుకరించారు.










