దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం జీవించిన ప్రజాకవి వేమన - అప్పటి సమాజాన్ని ఎంత దగ్గరగా చూశాడో, ఎంత కచ్చితంగా తన భావాలను వెల్లడించాడో ... ఆయన పద్యాలను చదివితే అర్థమవుతుంది. ఆయన కలం స్వార్థపర, విచ్ఛిన్న శక్తులను గడగడలాడించింది. దురాచారాలను, దుర్మార్గాలను చీల్చి చెండాడింది. అది కుల అహంకారమైనా, డబ్బు, అధికార మదమైనా, మత అంధత్వమైనా, మూఢవిశ్వాసమైనా, పాచి పట్టిన ఆచారమైనా, మనిషి మనసులోని కుళ్లయినా, కళ్లలోని పిరికితనమైనా ఏదైనా సరే ... దేన్నీ వదిలిపెట్టలేదు వేమన. అన్ని జాఢ్యాలను వేలెత్తి చూపాడు. విమర్శించాడు. దురాగతాల, దుర్మార్గాల వెనుక ఉన్న దోపిడీ మర్మాన్ని సామాన్యునికి అత్యంత సులభ శైలిలో విప్పి చూపించాడు. తిరగబడమని పిలుపునిచ్చాడు. ఆయన ఆటవెలదిలో అల్లిన అనేక పద్యాలు ఇప్పటి పరిస్థితులకు కూడా అతికినట్టు సరిపోతాయి.
నేడు మత విద్వేేషాలను రెచ్చగొట్టే భావజాలాన్ని స్వయానా పాలకులే పథకం ప్రకారం పారిస్తున్నారు. కులాల ఆధిపత్యాలూ, విబేధాలూ జడలు విప్పుతున్నాయి. అణగారిన బతుకులు మరింతగా అణచివేయబడుతున్నాయి. అనేక దురాచారాలు, అంధ విశ్వాసాలు పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందుతున్నాయి. మన అన్నది ఏదీ లేక నీదీ నాది అనే భావన వేళ్లూనుకుంటోంది. దేశభక్తి వంటి భావనలను సంకుచిత, స్వార్థపూరిత అర్థాలకు పరిమితం చేస్తున్నారు. దేవుణ్ని అడ్డం పెట్టుకొని ప్రజల మధ్య చిచ్చు పెట్టి వారి పొట్ట గొడుతున్నారు. ఇది తప్పు అని ఎవరైనా వేలెత్తి చూపిస్తే సహించలేని స్వార్థపర శక్తులు పెచ్చు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో వేమన పద్యం మన సమాజానికి చాలా అవసరం. నేటి సమాజంపై జరుగుతున్న విష సాంస్క ృతిక దాడికి సమాధానం చెప్పే పదునైన బల్లెం వేమన పద్యం. అందుకే అతడి భావాల వెలుగులను నేటి తరానికి మరింత సులభతరంగా పంచాలని తాపత్రయపడింది విజయవాడలోని 'జాషువా సాంస్క ృతిక వేదిక'. ముఖ్యంగా చిన్నారుల మనసులకు హత్తుకునేలా వేమన భావాలను వ్యాప్తి చేయాలని తలచింది.
అనుకున్నదే తడవుగా ఆ ఆలోచనను వినూత్నంగా అమలు చేసింది. ఆ బాధ్యతను చిన్నారులకే అప్పగిం చింది. వేమన పద్యాలకు బొమ్మలు గీచే పోటీని నిర్వహించింది. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి 110 చిత్రాలు వచ్చాయి. అందులో మెరుగైన వాటిని ఎంపిక చేసి పుస్తకంగా కూర్చింది. ఈ పుస్తకం ప్రత్యేకత అదే! వేమన పద్యాలను అవగాహన చేసుకొని చిన్నారులు వాటికి అందమైన బొమ్మలు గీశారు. పద్యానికి రంగులు అద్ది, జీవం పోశారు. వీటి నుంచి ఎంపిక చేసిన బొమ్మలతో 60 పేజీల అందమైన వేమన పద్యాల బొమ్మల పుస్తకాన్ని జాషువా సాంస్క ృతిక వేదిక ప్రచురించింది. 'వేమన పద్య ప్రగతికి పట్టం... కనదగునెవ్వరు గీసినా ...' అనే శీర్షికన వెలువడిన ఈ పుస్తకం. అపురూపమైనది. అందరి చేతిలో ఉండదగినది.
'ప్రజాకవి వేమన' అంటూ యు.వి. రామరాజు ముందుమాట రాశారు. ఓ పదునైన వేమన పద్యాన్ని ప్రస్తావిస్తూ ఆ ముందుమాట మొదలవుతుంది. ''కులము గలవారు గోత్రంబు గలవారు/ విద్యచేత విర్రవీగువారు/ పసిడి కలుగువాని బానిస కొడుకులు/ విశ్వదాభిరామ వినురవేమ..'' వేమన ఎంత నిర్భయంగా, నిర్మొహమాటంగా తన భావాలను వెల్లడించాడో చెప్పటానికి ఈ ఒక్క పద్యం చాలు. ఇది చదివితే ... నేడు దేశంలోని రాజకీయాలు,ప్రభుత్వాలు, పాలకులు కార్పొరేట్లకు దాసోహం అంటున్న పరిస్థితి కళ్లకు కడుతుంది. ఈ పుస్తకంలోని దాదాపు 60 పద్యాలను పిల్లల బొమ్మల్లోంచి, వాళ్ల ఆలోచనల్లోంచి మనం తిలకించవొచ్చు. చాలా నాణ్యమైన కార్డుబోర్డు పేపరు మీద రంగుల్లో చాలా అందంగా వెలువరించిన ఈ పుస్తకం పిల్లల అందరి చేతిలోకి వెళ్లాలనేది ప్రచురణ కర్తల ఆలోచన. అందుకే రూ.25ల ధరనే నిర్ణయించారు. ప్రతులకు 99515 40671 నెంబర్లో సంప్రదించవచ్చు. ఈ పుస్తక ప్రచురణకు ఆలోచన- ఆచరణ ఎ.సునీల్ కుమార్, వొరప్రసాద్, అనిల్ డ్యానీ. అభినందనీయమైన కృషి చేశారు. చిత్రకారుల పేరును బొమ్మ దిగువన విడిగా ఇస్తే బాగుండేది. అలాగే 'ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికిన గానీ నలుపు నలుపే కానీ తెలుపు రాదు..' వంటి భావాలతో కూడిన పద్యాలను పరిహరిస్తే బాగుండేదని అనిపించింది. జాషువా సాంస్క ృతిక వేదిక ఇటీవల అనేక ప్రయోజనకర కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు, ప్రచురణలు మరిన్ని జరగాలని మనసారా ఆశిద్దాం.
- ఎల్.శాంతి
76800 86787










