Aug 14,2023 22:00
  • జులైలో 7.44 శాతానికి చేరిక

న్యూఢిల్లీ : దేశంలో ధరలు మళ్లీ కోరలు చాస్తున్నాయి. గత నెలలో కూరగాయలు, ఇతర వంట సరుకుల ధరలు ఎగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలో 2023 జులైలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) ఏకంగా 7.44 శాతానికి పెరిగింది. ఇంతక్రితం నెల జూన్‌లో ఇది 4.87 శాతంగా ఉంది. గడిచిన నెలలో ముఖ్యంగా అహారోత్పత్తుల ధరలు 11.5 శాతం పెరిగాయని సోమవారం కేంద్ర గణంకాల శాఖ స్వయంగా వెల్లడించింది. దీంతో ద్రవ్యోల్బణం సూచీ 15 మాసాల గరిష్టానికి చేరింది. ఇంతక్రితం 2022 ఏప్రిల్‌లో ఈ స్థాయిలో ధరలు నమోదయ్యాయి. గడిచిన జులైలో కూరగాయల ధరలు 37.3 శాతం పెరిగాయి, తృణధాన్యాలు, పప్పులు 13 శాతం పైగా ప్రియమయ్యాయి. పట్టణాల్లో అహార ద్రవ్యోల్బణం 12.3 శాతానికి చేరగా.. గ్రామీణ ప్రాంతాల్లో 11 శాతంగా చోటు చేసుకుంది.
చాలా మంది ఆర్థిక నిపుణుల అంచనాలు మించి ధరల పెరుగుదల చోటు చేసుకోవడం ఆందోళనకరం. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 6 శాతానికి రెండు శాతం అటూ, ఇటుగా కట్టడి చేయాలనే ఆర్‌బిఐ లక్ష్యానికి భిన్నంగా చోటు చేసుకోవడం గమనార్హం. మసాలా దినుసులు 21.6 శాతం, పాలు 8.34 శాతం చొప్పున పెరిగాయి. జూన్‌తో పోలిస్తే బంగాళాదుంప ధరలు 8 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఉల్లిపాయలు కూడా 28 శాతం ఎగిశాయి. ఆగస్ట్‌ ప్రారంభంలోనూ అహార ధరలు సానుకూలంగా లేవని ఇక్రా చీఫ్‌ ఎకనామిస్ట్‌ అదితి నాయర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే అధిక ధరలు ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నాయి. మరింత పెరుగుతోన్న ధరలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.