Aug 14,2023 08:01

           ''...హం పరం అంటూ ప్రత్యేకంగా ఉండవు. ఈ సృష్టిలో ఉన్న ప్రతీ పదార్థం మార్పుకి లోనవుతుంది. ఏ వస్తువులోనూ నిత్యమూ, శాశ్వతమైన పదార్థం వుండదు'' ఇది కళింగనేలలో వందలేళ్ల కిందటి తాత్త్వికధార. వైదిక తాత్త్వికతను విమర్శించిన ధార. ''... కళింగుల జీవన విధానం మిగిలిన ప్రాంతాల జీవన విధానం కంటే భిన్నమైనది. మంచివారిగా బతకాలనుకున్నారే తప్పా, అందుకు ప్రతిఫలంగా స్వర్గాన్ని ఆశించలేదు. దొరికినదో, ఉత్పత్తి చేసినదో తోటివారితో పంచుకున్నారు. పనులు విభజించుకొని, ఎవరి పని వారు చేసుకుంటూ సమష్టిగా ప్రయోజనం పొందారే తప్పా, వృత్తుల మధ్య తేడాలు పాటించలేదు. ఈ క్షణంలో యీ భూమి మీద జరిగే కార్యానికి కారణం యిక్కడే వెతికారు తప్పా, పూర్వజన్మలకి ముడిపెట్టలేదు. ఈ ప్రకృతి సంపదను ఎన్నడూ స్వంత ఆస్తిగా భావించలేదు. సత్రంలో బాటసారిలా జీవించేరు, వెళ్లిపోతూ సమాజానికి అప్పజెప్పారు.'' ఓ ఆదర్శ పూర్వక జీవన తాత్త్వికత గల కళింగప్రాంతం గురించి యిలాంటి వాక్యాలు యింతకుముందు చదివిలేము! అగస్త్యుని రాకతో ఆరంభమైన వైదిక భావజాల దండయాత్ర ఆపస్తభునితో పూర్తయింది. వేద కేంద్రాలు, స్థావరాలు, యఙ్ఞవాటికలు తదితరాలు నెలకొల్పి, కేవలం భూమండలాన్నే కాదు, మానవ ఙ్ఞాన మండలాన్ని కూడా గుప్పిట పెట్టుకున్నారు. 'ఉపనిషత్తులలో తాత్త్విక అన్వేషణ, తార్కిక జిఙ్ఞాస వుండొచ్చు. పరిమళభరితమైన పుష్పం వెనుక ముళ్లు దాక్కున్నట్టు ఆత్మ, బ్రహ్మ అనే రెండు పదాలతో మానవ మస్తిష్కం ఊబిలో కూరుకుపోవడానికి, మానవచైతన్యం చతికిలబడిపోవడానికి మిధ్యావాదం దాగివుంది' ఈ విశ్లేషణ కూడా విని వుండము.
         జైన, బౌద్ధ, వైదిక భావధారలను చర్చిస్తూ... యింకోవేవు రాచరిక పాలన చరిత్రను వివరిస్తూ - (కురుక్షేత్ర యుద్ధంలో కళింగులు కౌరవుల తరపున పోరాడడం, సుయోధనుని భార్య భానుమతి కళింగ ఆడపడుచు వంటి కొన్ని చారిత్రక అంశాలను వివరించటం) ప్రఖ్యాత చక్రవర్తి కళింగమ్మీద దండెత్తి, సంపద్వంత కళింగాన్ని శ్మశాన సదృశ్యం చేసి, వైరాగ్యం పొంది ... బౌద్ధం స్వీకరించి, బౌద్ధ ధర్మానికి జీవితాన్ని అంకితం చేసి, వృద్ధాప్యంలో మరణించినదాకా - కళింగనేల జన జీవనాన్నీ, కళింగనేల ప్రకృతి సంపదలనీ ... పరాయి నేలల నేతల దాడుల నుంచి యెదుర్కున్న వీరోచిత కళింగాన్నీ... దీర్ఘాసి విజయభాస్కర్‌ గారు ఈ నవలలో దృశ్యమానం చేసారు. 'గణతంత్ర నిర్వహణలో జంబూద్వీపానికే తలమానికం కళింగం. ధైర్యసాహసాలు ఉట్టిపడే సేనల కళింగం. అటవీ సంపదలకు నిలయ కళింగం. తార్కిక ఆలోచనా, తాత్త్విక చింతనతో మదించిన మత్తేభం కళింగం...'' ఇలాంటి వాక్యాలెన్నో ఈ నవలలో! నాటి కళింగ ఘనతకు అద్దం పట్టిన వాక్యాలివి. 'చారువాకీ! నేను చక్రవర్తినే కదా?'' అశోక చక్రవర్తి ప్రశ్న
          కారువాకి యేమీ బదులివ్వదు. (కళింగ ఆడపడుచు కారువాకి. ప్రేమ పేరుతో ఆమెను తన రాజ్యానికి తీసుకుపోతాడు. ఆమె పట్ల ప్రేమ కలవాడు. ప్రేమగా చారువాకీ అని పిలుస్తుంటాడుట) అశోకచక్రవర్తి రొక్కించుతాడు. అప్పుడు బదులిస్తుంది : ''... మీరు చక్రవర్తి కారు... కానీ అయ్యారు...'' అని. అర్థం కాదు అశోకునికి. 'అంటే?' అని ప్రశ్నిస్తాడు. కళింగుల మాటల్లో శ్లేష, వ్యంగ్యం ఆనాటిదే, విజయభాస్కర్‌ గారు భలేగా రాసేరు.
            'శత సోదర హతం - సింహాసనం హస్తగతం' అనంటుంది. కారువాకి తన కళింగనేల పట్ల గల ప్రేమకు, ఆరాధనకూ, కళింగ ప్రజల వీరోచిత తత్త్వానికీ అద్భుత అక్షరరూపం అశోకుడు కళింగమ్మీదకు దండయాత్రకు వెళ్తానన్నప్పటి సన్నివేశం. అశోకుడు తొలిసారి కారువాకిని మత్స్యలేశం వద్ద కలసినపుడు, కారువాకి చేతిలో పదునైన ముళ్లు కలిగిన ఎండిన చేప బుర్ర వుంటుంది. అది ఆటవస్తువు కాదు, వేట వస్తువు అంటారు రచయిత! ఇంతకీ కళింగమ్మీద అశోకుడెందుకు దండయాత్ర చేయదలచుకున్నాడు? అంతకుముందర అశోకుని తండ్రి చేయాలనుకొని చేయలేకపోవడాన్ని, అనేక చక్రవర్తులు కళింగాన్ని జయించలేకపోవడాన్నీ నవలలో ముందరి పేజీల్లో చదువుతూ వచ్చిన పాఠకునికి యీ సన్నివేశంలో అశోకుడు చెప్పిన కారణాలతో మొత్తం దండయాత్రల (అది రాజులదో, మతవాదులదో) కీలకం అర్థమవుతుంది.
'చారువాకీ! మా అన్వేషకులు, పరిశోధకులు యాత్రికుల రూపంలో కళింగుల గురించి తెలుసుకున్న విశేషాలు వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. (చదువుతుంటే పాఠకునికీ గగుర్పొడుస్తుంది) సియామ్‌కి పూర్వం పేరేమిటో తెలసా.. కళింగ రాష్ట్రం. అది అనేకులకు ఆకర్షణీయమైనది. ఏనుగులు, వాటి దంతాలు, మయూరాలు, పులికూనలు, సుగంధ ద్రవ్యాలు, సన్నని వస్త్రాలు, సున్నితమైన గాజు వస్తువులు, అలంకార ప్రతిమలు వగైరాల ఎగుమతులతో సుభిక్షంగా వుంది. అలాగే ఆ నేలలోకి వైదికం ఒకవేపు ప్రవేశిస్తోంది. అది బలపడకముందే, ఇతర రాజ్యాలు లోబరుచుకోకముందే మేము కళింగాన్ని మగధలో కలుపుకోవాలి. అందుకు యుద్ధమే శరణ్యం' అనంటాడు అశోకుడు. సరిగ్గా ఆనాటి అశోకుడి నుంచి ఈనాటి ఆల్‌ఖైమా వంటి కార్పొరేట్‌ శక్తులూ, పరప్రాంత పెట్టుబడి బలగాలూ కళింగమ్మీద ఈ కారణాలతోనే, సహజ వనరుల, సంపద్వంత సీమ అయినందునే దోచుకోవడానికి దారి కడుతున్నాయి. దండెత్తుతున్నాయి. అశోకుడి నాటి నుంచీ కళింగం సముద్రతీర వ్యాపార ప్రసిద్ధ కేంద్రం. అడవులూ, సారవంత మైదానాలూ... ఆరుగాలం కష్టించే బహుజన శ్రమజీవులూ నడయాడే నేల! అయిదు వందల కిలోమీటర్ల అటవీ ప్రాంతం. ఇక్కడ విలువైన వృక్ష సంపదే కాక, ఐదువందల రకాల ఔషధమొక్కలున్నాయి. ఖనిజాలున్నాయి. కష్టించే ఆదివాసులున్నారు. అడవినీ, ఖనిజాలను కొల్లగొట్టడానికి కార్పొరేట్‌ కంపెనీలు కాలుమోపుతున్నాయి ఇపుడు.
        350 కిలోమీటర్ల సముద్రతీరముంది. వేలకోట్ల రూపాయల మత్స్యసంపద దొరుకుతుంది. తీరంలో యురేనియం వంటి విలువైన ఖనిజాలున్నాయి. పరప్రాంత పెట్టుబడి బలగాలు తీరం అంతటా హస్తాలు చాపుతున్నాయి. పాతిక లక్షల ఎకరాల పంటభూములున్నాయి. పద్దెనిమిది జీవనదులున్నాయి. అధిక వర్షపాత ప్రాంతమిది. అయిదొందల టీఎంసీల నీళ్లు లభ్కమవుతాయి. అయినా మూడోవంతు పంటభూమికి మాత్రమే సాగునీరు లభ్యమవుతుంది. ఆరంభించిన నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తిచేయరు. వ్యవసాయాధార పరిశ్రమలను మూసివేతకు గురిచేసి, కాలుష్య కారక, ప్రమాదభరిత పరిశ్రమలను ప్రవేశపెడతారు. ఏటా కళింగం నుంచి పొట్ట చేతను పట్టుకొని యేభయి వేలమంది పరప్రాంతాలకు వలస పోతున్నారు. విద్య, వైద్యం, రవాణా, ఉపాధి రంగాల్లో ఆఖరి ప్రాధాన్యతనిస్తాయి ప్రభుత్వాలు. చివరికి వెనుకబడిన ప్రాంతమనే ట్యాగ్‌ తగిలిస్తారు. నిజానికిది వెనుకబడిన ప్రాంతం కాదు, వెనుకబాటుకు గురి చేసిన ప్రాంతం.
          చక్రవర్తుల నెదిరించిన స్వతంత్ర గణతంత్ర సీమ, తెల్లదొరతనమ్మీద పోరాడింది. జమీందారీలతోపోరాడింది. రైతు రక్షణయాత్ర చేసింది. రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపింది. నిన్న, మొన్నటి... సోంపేట, కాకరాపల్లిల్లో కార్పొరేట్లపై కాలుదువ్విన రాజకీయ రణధీర కళింగం. ఆధునిక కథ, నాటకం (గురజాడ) అందించింది. హరికథ (హరికధ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు) వినిపించింది. వయెలిన్‌ (ద్వారం వెంకటస్వామినాయడు) వాయించింది, కవిత్వంతో మహాప్రస్ధానం (శ్రీశ్రీ) చేయించింది. ప్రపంచ ప్రసిద్ధ మల్లయోధుడిని (కోడి రామ్మూర్తినాయుడు) ఇచ్చింది. ఎందులో వెనుకబడింది కళింగం? ఎవరి వలన వెనుకబాటుకి గురయ్యింది? ఎన్నాళ్లీ వెనుకబాటు? ఎన్నెన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో వివక్షలు దీర్ఘాసి విజయభాస్కర్‌ గారిని వెన్నాడివుంటాయి. వేదనకూ, ఆగ్రహానికీ గురిచేసి వుంటాయి. వాటి ఫలితమే... ఈ గ్రంథం. ఇది కళింగనేల గత చరిత్ర. ఘన చరిత్ర. ఈ చరిత్రను శోధించి, నవలీకరించటం సాధారణ విషయం కాదు. విజయభాస్కర్‌ గారు చరిత్ర అనే ప్రవాహంలో ఈదులాడినారు. మునిగీ, తేలీ, అగాధమౌ కళింగ జలనిధిలోంచి 'వీరకళింగం' అనే ఆణిముత్యాన్ని తీసుకొచ్చేరు. వివక్షకు గురైన వర్తమాన కళింగ జనావళికి వీరఖడ్గాన్ని అందించేరు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ప్రముఖ రచయిత, మేధావి, చినవీరభద్రుడు గారు అన్నట్టు - రానున్న రోజుల్లో కళింగాంధ్రలో ఒక నవ్య రాజకీయ, సామాజిక భవిష్యత్‌కు దారితీయగలదు. (వీరకళింగం నవల; పేజీలు : 260, వెల : రూ.200. అన్ని ముఖ్య పుస్తక విక్రయ కేంద్రాల్లో దొరుకుతుంది.)
 

- అట్టాడ అప్పల్నాయుడు