ప్రజాశక్తి- రేపల్లె (బాపట్ల) : మిషన్ వాత్సల్య పథకం ద్వారా అనాధ పిల్లలకు లబ్ది చేకూరుతుందని ఇంచార్జ్ సిడిపిఓ డి.మాణిక్యం అన్నారు. మంగళవారం రేపల్లె ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్స్ కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ... 18 సంవత్సరాలలోపువారు, పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రులను కోల్పోయి నిరాదరణకు గురైన నిరాశ్రయులు, నిస్సహాయ అనాధ బాలలను ప్రభుత్వం గుర్తించి అర్హులైన బాలలకు మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ ప్రయోగిత పథకం ద్వారా ప్రతి నెలకు 4,000 రూపాయలు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. రాష్ట్రం లోని అన్ని జిల్లాలలో బాలల రక్షణ, సంరక్షణను దఅష్టిలో పెట్టుకుని ఈ పథకంపై సంబంధిత మండలంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు ఈ పథకంపై అవగాహన దరఖాస్తులు చేయిస్తున్నారన్నారు. మండలంలో ఇప్పటివరకు 350 దరఖాస్తులు వచ్చాయని, అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం మే 30వ తేదీ వరకు అవకాశం కల్పించిందని ప్రకటించారు.










