Jul 27,2023 14:52

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు వద్ద వశిష్ట గోదావరి గురువారం మధ్యాహ్నం నుంచి గంట గంటకు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో ధవళేశ్వరం నుంచి కిందకు సుమారు 5లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేయడంతో నియోజవర్గ పరిధిలోని గోదావరి నది పోటెత్తుతుంది. పెదమల్లం, కోడేరు, కరుగోరు మిల్లి, భీమలాపురం, పుష్కర ఘాటులు పూర్తిగా నీట మునిగాయి. దీంతో నదిలో నాటు పడవలో రాకపోకలపై అధికారులు నిషేధించారు. పుష్కర ఘాటులో ముందస్తు చర్యగా ఆచంట ఎస్సై ఎం రాజ్‌ కుమార్‌ హెచ్చరిక బోర్డులు పెట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యం గురువారం నదీ పరివాహక తీర గ్రామాల్లోని సందర్శించారు. నది మధ్యలో ఉన్న అయోధ్య లంక, ఆనగారలంక, కోడేరు పల్లిపాలెం, పుచ్చలంక, రాయిలంక, మర్రి మూల, గ్రామాల్లో వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ గ్రామాలలో వీఆర్వోలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. బీమలాపురం పంచాయతీ పరిధి కాపులపాలెం ఏటిగట్టు దిగువన ఉన్న సుమారు 100 కుటుంబాలు వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండు రోజుల వరకు ఉధతి పెరిగే అవకాశం ఉందని లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.