Oct 31,2022 08:24

'వాజ్మయూఖాలు' కవితా సంపుటి రచయిత బుడితి రామినాయుడు వివిద కళలకు ఆలవాలమైన 'విజయనగరం' పట్టణానికి చెందినవారు. వాక్‌ అంటే మాట, మయూఖాలు అంటే కిరణాలు అని అర్థం. మరోలా చెప్పాలంటే జ్ఞానాన్ని ఇచ్చే మాటలు, ప్రకాశవంతమైన మాటలు అని అర్థం. ఈ కవితా సంపుటిలో 8 వచన కవితలు, 6 గేయ కవితలు, 17 పద్య కవితలు మొత్తం 31 కవితలు ఉన్నాయి. ఇది 68 పేజీల కవిత్వపు సుగంధం. ఈ సంపుటిలో ప్రాకృతిక, సామాజిక, సంగీత, సాహిత్య కళా సంబంధాలైన కవితా వస్తువులు నిబిడీకృతమై ఉన్నాయి.
           'కాలం గారడి' అనే కవితలో 'కంటికి కనపడకుండా గారడి చేస్తున్నావు/ తెలుసు నాకు తెలుసు/ నీవు కాలానివి! కాలానివి' అంటూ కాలాన్ని ఇంద్రజాలంగా భావిస్తున్నాడు కవి. 'అనుకూలంగా సాగుతావు ప్రతికూలంగా రేగుతావు/ అంతర్జాల మాయాజాలంతో/ అంతర్జాతీయపు హద్దులు చెరిపి/ ఆ మెయిలును అపహసించి/ ఈ-మెయిలును సృష్టించి/ తత్తరపాటు లేక ఉత్తరాల్ని తక్షణమే/ ఖండాంతరాలకు చేరవేసి/ ఖ్యాతిని మూటగట్టుకున్నావు' అంటూ ఎక్కడో విదేశాల్లో ఉంటున్న మా వాళ్ళ కనుల ముందు కనబడుతూ, మాతో సరదాగా మాట్లాడుతున్నావు' అని అంతర్జాల సౌఖ్యాన్ని కవి ప్రశంసిస్తున్నారు. 'కాగితాలు లేకుండానే/ కార్యాలయం పని జరుపుతున్నావు/ డబ్బాలో ఆనవాలు దూర్చితే/ డబ్బులు చెల్లించేస్తున్నావు' అంటూ కంప్యూటర్‌, ఎటిఎంల వల్ల ప్రజలకు లభిస్తున్న సౌకర్యాన్ని మెచ్చుకుంటాడు కవి. 'నా ఒళ్ళు నాకు బరువుగా చేశావు/ నా శిష్యుడ్ని నా గురువుగా చేశావు' వాహనాలు లేకపోతే జనం ఇల్లు కదలక పోవడాన్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఎంత పెద్ద వారైనా పిల్లల్ని ఆశ్రయించక తప్పదని అంటూ నేటి బద్ధకస్తులు, ఇతరులపై వాలే వారిని గూర్చి చెబుతూ కవి ఆశ్చర్యపోతున్నాడు.
        సామాజిక అంశాలకు సంబంధించిన కవిత 'ఎన్నుకొండి'. ఇందులో పలు రాజకీయ అంశాలను వ్యంగ్యంగా ఎత్తి చూపుతాడు. రాజకీయ నాయకుల దుశ్చర్యలను ఎండగడతాడు. 'ఎన్నుకొండి ఎన్నుకొండి/ నన్ను నా పార్టీని/ ఎన్నడు కనివిని యెరుగని/ ఎన్నెన్నో పనులు చేస్తాం/ బ్రాందీ షాపులన్నిటికీ/ పర్మిట్లు మంజూరు చేస్తాం/ ప్రజారోగ్య రక్షణకై/ భారీగా నిధులిస్తాం/ పొగాకు పంటలకు/ ప్రోత్సాహకాలు ప్రకటిస్తాం/ కేన్సరు ఆసుపత్రుల్ని/ వెనువెంటనే కట్టిస్తాం' అని ఒకవైపు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామంటూ, మరోవైపు మందును ఏరులై పారిస్తామని, ఆసుపత్రులు కట్టిస్తామని పాలకులు వింతగా చెప్పడాన్ని తప్పుబడతాడు కవి. 'అయ్యో భారతదేశం' కైతలో రోజూ ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరగటాన్ని తప్పుబడుతూ కుమిలిపోతాడు కవి. 'అయ్యో భారతదేశం- అత్యాచార ప్రదేశం/ అర్ధరాత్రి కాదు గదా-అపరాహ్ణం లోనైనా/ ఒంటిగ ఆడది వెళితే- తుంటరులకు చిక్కినట్లె' అంటూ మహిళలకు ఎదురవుతున్న అగచాట్లను పూసగుచ్చినట్లు ప్రస్తావిస్తాడు. మూర్ఖులను, మోసగాళ్లను, రౌడీలను తుద ముట్టించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తారు. 'ఆత్మవంచన' కవితలో ప్రజాస్వామ్య వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టారు. 'ఓటు చూపి నోటు లాగి/ కుహనా నాయకుల్ని ఎన్నుకొని/ అభివృద్ధి జరగలేదని ఆక్రోశిస్తున్నావు'. నిజాయితీపరుడైన అభ్యర్థిని ఎన్నుకోవడం మానేసి తదనంతరం బాధపడితే ఏమి లాభం? అని కవి జనాన్ని ప్రశ్నిస్తాడు. 'పేరు చివర కులం పేరు తగిలించి/ గొప్పగా ప్రచారం చేసుకుంటూ/ కుల వివక్షకు గురి అవుతున్నానని/ కుయ్యో మొర్రో అంటున్నావు' ఈ వాక్యాలు అణగారిన వర్గాలను ఉద్దేశించి కవి అన్నట్లుంది. కానీ ఇవి సబబు అయిన పలుకులు కావు. ఎందుకంటే వీరు పేరులో కులం తెలిసేలా పేరు చివరన చిహ్నాలు ఉంచడమనేది తమ అస్తిత్వాలను కాపాడుకునే క్రమంగానే భావించాలి.
        'మూఢవిశ్వాసాలు' అనే కవితలో పల్లెల్లో చిల్లంగి, చేతబడి పేరిట సాగుతున్న దారుణ మారణకాండలను కవి ఉదహరిస్తాడిలా. 'కడుపు నొప్పి వచ్చినా/ కాలు నొప్పి పెట్టినా/ అదిగో వాడే వాడే/ చిల్లంగి పెట్టాడని/ కొట్టి కొట్టి చంపుతున్న/ క్రూరులు మనలో కలరని' అమాయకమైన వ్యక్తుల పాలిట ఈ మౌఢ్యం యమపాశమై చుట్టుకోవడాన్ని విమర్శించారు. 'మహిమలు మాలో కలవని/ జనుల్ని మోసం చేసే/ కుహనా స్వాములు మనలో/ కోకొల్లలు ఉన్నారని' ప్రజల్లో పలు మూఢ నమ్మకాలని యధేచ్చగా ప్రోదిచేస్తున్న పలువురు స్వాములను ఈ కవితలో ఎండగడతాడు కవి. శాస్త్ర విజ్ఞానం పెరిగినప్పటికీ ఈ నవీన భారతంలో ఇంకా మూఢ నమ్మకాలు పెరిగిపోవడం పట్ల కవి ఆందోళన చెందుతాడు.
        మాతృభాష అవసరాన్ని 'అమ్మభాష' అనే కవితలో ఇలా గుర్తుకు తెచ్చుకుంటాడు కవి. 'అమ్మ భాషతోనే/ అభివృద్ధిని సాధించుకుందాం/ ఆంగ్లభాష మీది మోజు/ అదుపులోన ఉంచుదాం/ అధికార భాషా సంఘాన్ని/ పదిలంగా పక్కకు పెట్టి/ ఆత్మవంచన చేసుకున్నది/ ఆంధ్రప్రదేశ్‌ ఇన్నాళ్లూ' అంటూ నేటి పరభాష వ్యామోహంలో ఉన్న పాలకుల వైఖరులను చీల్చి చెండాడతాడు. తిరుపతి తెలుగు మహాసభల్లో ప్రభుత్వం భాషాభివృద్ధికి పలు తీర్మానాలు చేసిందనీ, కానీ ఏ ఒక్కటి కూడా ఆచరణ జరగలేదనే విషయాన్ని ఈ కవిత ద్వారా గుర్తుచేసాడు. పాలనా భాషగా తెలుగు వెలుగొందాలని కవి అభిలషిస్తాడు. 'గురజాడా కవిరేడా' కైతలో 'తాత వయసు పెళ్ళికొడుకులు/ తాళికట్టు ఆ శుభ వేళలో/ అక్షతలు జల్లిన అవివేకపు సమాజంపై' అక్షరాయుధాన్ని సంధించిన కవనయోధుడవు నీవేనయ్యా! అంటూ గురజాడను కీర్తించాడు. 'దేశమంటే మట్టికాదోరు దేశమంటే మనుషులోరు' అనే నూతన సందేశాన్ని జనానికి ఎరుకుపరిచావని శ్లాఘిస్తాడు కవి.
           రామినాయుడు ఏ అంశంపై కవిత రాసినా తనదైన ముద్ర గోచరిస్తుంది. కొన్నింటి సౌందర్య పిపాస, మరికొన్నింటి ప్రకృతి రమణీయత, ఇంకొన్నింట సమాజ గమనంలోని వివిధ పోకడల పోహళింపు కానవస్తాయి. సమకాలీన సమాజంలోని దురాగతాలను, దురాచారాలను నిర్భీకంగా ఎత్తిచూపడంలో ఎంత మాత్రమూ వెనుదీయరు. పద్యమైనా, గేయమైనా, వచనమైనా హృద్యంగా సాహితీపరులకు అందించడంలో ఆయన అందె వేసిన చేయి. (ఈ కవి 92 ఏళ్ల వయసులో 28.10.2022 తేదీన విజయనగరం లోని తన ఇంట్లో కన్నుమూశారు. ఆయన స్మ ృతికి నివాళి)

పిల్లా తిరుపతిరావు

- పిల్లా తిరుపతిరావు
70951 84846