Aug 20,2023 22:01

ప్రజాశక్తి - పిఎం.పాలెం (విశాఖపట్నం) :విశాఖ పిఎం పాలెం సమీపంలోని ఎసిఎ - విడిసిఎ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం వైజాగ్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్‌ జట్టు 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలుచుకున్న వైజాగ్‌ వారియర్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాంధ్ర లయన్స్‌ బ్యాట్స్‌మెన్‌లు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 206 పరుగులు సాధించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన గుల్ఫామ్‌ సలే నిరుత్సాహపరిచారు. కెఎస్‌.భరత్‌, మూడో స్థానంలో దిగిన ఎస్‌వి రాహుల్‌ బ్యాటింగ్‌తో అలరించారు. కెప్టెన్‌ భరత్‌ ఈ మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించారు. 23 బంతుల్లో 4 సిక్స్‌లు, 3 ఫోర్‌లతో 45 పరుగులు చేశారు. ఎస్‌వి.రాహుల్‌ 36 బంతుల్లో 3 సిక్స్‌లు, 3 ఫోర్‌లతో 53 పరుగులు చేసి శభాష్‌ అనిపించుకున్నారు. వీరిద్దరూ 59 బంతుల్లో 98 పరుగులు చేసి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించారు. అనంతరం పి.తపస్వి 23 బంతుల్లో 2 సిక్స్‌లు, 4 ఫోర్‌లతో 38 పరుగులు, ఎస్‌హెచ్‌.శ్రీనివాస్‌ 13 బంతుల్లో 4 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 33 పరుగులు సాధించారు. వీరిద్దరూ కలిసి 36 బంతుల్లో 71 పరుగులతో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. మొత్తంగా 20 ఓవర్లలో ఉత్తరాంధ్ర లయన్స్‌ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైజాగ్‌ వారియర్స్‌ క్రీడాకారులు 14.4 ఓవర్లకు 113 పరుగులు చేసి ఆలౌటయ్యారు. బౌలింగ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్‌ బౌలర్లు వై.పృధ్వీరాజ్‌ కేవలం 1.4 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కూలగొట్టారు. పి.తేజస్వి 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్‌ విజయంతో ఉత్తరాంధ్ర లయన్స్‌ టీమ్‌ వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకుంది. ఎస్‌వి.రాహుల్‌ అర్ధ సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు.