Nov 14,2023 22:14

డిసెంబర్‌లో హాకీ వరల్డ్‌ కప్‌..
భువనేశ్వర్‌: భారత పురుషుల జూనియర్స్‌ హాకీ జట్టు కెప్టెన్‌గా ఉత్తమ్‌సింగ్‌ ఎంపికయ్యాడు. మలేషియా వేదికగా జరిగే జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో భారతజట్టు పాల్గననుంది. ఈ మెగా టోర్నీలో ఆడే భారత జట్టుకు ఫార్వర్డ్‌ ప్లేయర్‌ ఉత్తమ్‌ సింగ్‌ కెప్టెన్‌గా, అరారుజీత్‌ సింగ్‌ హుందల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. డిసెంబర్‌ 5 నుంచి 16వరకు కౌలలంపూర్‌లో ఈ పోటీలు జరుగనున్నాయి. మొత్తం 20మందితో కూడిన భారత బృందాన్ని హాకీ ఇండియా(హెచ్‌ఐ) మంగళవారం ప్రకటించింది. 'మాకు పటిష్టమైన స్క్వాడ్‌ ఉంది. 2016 జూనియర్‌ వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టును స్ఫూర్తిగా తీసుకుని బరిలోకి దిగబోతున్నాం. మా ఏకైక లక్ష్యం ట్రోఫీ సాధించడమే. అందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం' అని కోచ్‌ సి.ఆర్‌. రమేశ్‌ వెల్లడించాడు. ఆసియా చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు గ్రూప్‌-సిలో ఉంది. కెనడా, దక్షిణ కొరియా, స్పెయిన్‌ ఇదే గ్రూప్‌లో ఉన్నాయి. డిసెంబర్‌ 5న జరిగే తొలి పోరులో భారతజట్టు కొరియాతో తలపడనుంది. డిసెంబర్‌ 7న స్పెయిన్‌, 9న కెనడాను ఢకొీననుంది. ఇక గ్రూప్‌ ఏలో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, మలేషయా ఉన్నాయి. గ్రూప్‌ బిలో ఈజిప్ట్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, దక్షిణాఫ్రికా, గ్రూప్‌-డిలో బెల్జియం, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ జట్లు ఉన్నాయి. లీగ్‌ పోటీలు ముగిసిన తర్వాత ప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించనున్నాయి.
భారత జట్టు స్క్వాడ్‌ ఇదే
గోల్‌ కీపర్లు : మోహిత్‌ హెచ్‌ఎస్‌, రణ్‌విజయ్ సింగ్‌ యాదవ్‌.
డిఫెండర్లు : శారదానంద్‌ తివారీ, అమన్‌దీప్‌ లక్రా, రోహిత్‌, సునీల్‌ జోజో, అమిర్‌ అలీ.
మిడ్‌ ఫీల్డర్స్‌ : విష్ణుకాంత్‌ సింగ్‌, పూవన్న సీబీ, రాజిందర్‌ సింగ్‌, అమన్‌దీప్‌, అదిత్యా సింగ్‌.
ఫార్వర్డ్స్‌ : ఉత్తమ్‌ సింగ్‌(కెప్టెన్‌), ఆదిత్యా లలాగే, అరారుజీత్‌ సింగ్‌ హుందల్‌(వైస్‌ కెప్టెన్‌), సౌరభ్‌ ఆనంద్‌ కుశ్వహ, సుదీప్‌ చిర్మకో, బాబీ సింగ్‌ ధామి.
రిజర్వ్‌ ప్లేయర్స్‌ : సుఖ్విందర్‌, సునిత్‌ లక్రా.