Nov 04,2023 13:26

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అయ్యప్ప నగర్‌ నుండి ప్రధాన రహదారిపైకి వచ్చే చోట స్పీడ్‌ బ్రేకర్స్‌ లేకపోవడంతో నెలరోజుల్లో ఇప్పటికీ ముగ్గురు మరణించారనీ.. అయినా నేటికీ మున్సిపల్‌ అధికారులు ఏమాత్రం స్పందించలేదనీ పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు, అయ్యప్ప నగర్‌ పోరాట కమిటీ కన్వీనర్‌ యుఎస్‌.రవికుమార్‌ లు ప్రశ్నించారు. శనివారం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ... గత 2 ఏళ్లుగా అయ్యప్పనగర్‌ నుండి ప్రధాన రోడ్డుపై స్పీడ్‌ బ్రేకర్స్‌ వేయాలని చాలాసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించామన్నారు. చివరికి శాసనసభ్యులు కాలనీకి వచ్చి తమ ముందే కార్పొరేషన్‌ డీఈ కి చెప్పినా కూడా అధికారులకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. వెంటనే అధికారులు అయ్యప్ప నగర్‌ మెయిన్‌ రోడ్‌, హనుమాన్‌ నగర్‌ వద్ద రోడ్డుపై స్పీడ్‌ బ్రేకర్స్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నా అనంతరం మేనేజర్‌ కి వినతిపత్రం సమర్పించారు. వెంటనే అధికారులు అయ్యప్ప నగర్‌ మెయిన్‌ రోడ్డులో స్పీడ్‌ బ్రేకర్స్‌ వేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, సిఐటియు నగర కార్యదర్శి బి.రమణ. అయ్యప్ప నగర్‌ అసోసియేషన్స్‌ కార్యదర్శి ఎన్‌.సుదీర్‌, అయ్యప్ప నగర్‌ ప్రజలు పాల్గొన్నారు.