- మరో వెయ్యి స్టోర్లు తెరుస్తాం.. మెడ్‌ప్లస్ ఎండి వెల్లడి
హైదరాబాద్ : తమ బ్రాండ్ ఔషద ఉత్పత్తులపై 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రముఖ మెడిసిన్ రిటైలర్ చెయిన్ మెడ్‌ప్లస్ ఎండి, సిఇఒ గంగడి మధుకర్ రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన ఆసంస్థ సిఒఒ చెరుకుపల్లి భాస్కర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం 500 ఆఫ్ పేటెంట్ థెరప్యూటిక్, క్రానిక్ మెడిసిన్స్ ఉత్పత్తులపై ఈ భారీ తగ్గింపును అందిస్తున్నామని వెల్లడించారు. వచ్చే మూడు మాసాల్లో మొత్తంగా 700-800 ఉత్పత్తులపై పెద్ద మొత్తంలో డిస్కౌంట్ అందించే యోచనలో ఉన్నామన్నారు. ఇందులో హుద్రోగ, కిడ్నీ, హైపర్‌టెన్షన్ తదితర వ్యాధులకు సంబంధించిన కీలక ఔషదాలు కూడా ఉంటాయన్నారు. ఆయా ఔషదాలపై కనీస కొనుగోలు చేస్తేనే తగ్గింపు ఉంటుందేనే షరతు ఏమీ ఉండదన్నారు. నాణ్యమైన మందులను పొందడంతో పాటుగా వినియోగదారులకు పెద్ద మొత్తంలో పొదుపు కానుందన్నారు. తమకు సొంత డిస్ట్రిబ్యూషన్ సిస్టం, కాంట్రాక్టు మాన్ఫుఫాక్చరింగ్ వ్యవస్థ ఉండటంతో అధిక డిస్కౌంట్లను ఇవ్వగలుగుతున్నామన్నారు. ప్రస్తుతం తమకు దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 3,827 మెడ్‌ఫ్లస్ స్టోర్లు ఉన్నాయన్నారు. 22వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారన్నారు. గతేడాది 1024 కొత్త అవుట్‌లెట్లను ఏర్పాటు చేశామని.. ఈ ఏడాది మరో 800-1000 మెడికల్ స్టోర్లను తెరువాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.4500 కోట్ల టర్నోవర్ నమోదు చేశామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం వృద్థి అంచనా వేస్తున్నామన్నారు.