Nov 17,2023 09:24
  • అన్ని శాఖలకూ జిఎడి ఆదేశం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అన్ని శాఖలూ జిఓలను ఎపి గెజిట్‌ వెబ్‌సైట్లో కచ్ఛితంగా అప్‌లోడ్‌ చేయాలని, 2022 ఏప్రిల్‌ ఒకటి నుండి ఇప్పటి వరకూ ఇచ్చిన జిఓలన్నీ అందులో చేర్చాలని సాధారణ పరిపాలనశాఖ అన్ని విభాగాలకూ ఆదేశాలు జారీ చేసింది. చేయని పక్షంలో సంబంధిత అధికారిని బాధ్యుడిని చేస్తామని పేర్కొంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత జిఓలను అప్‌లోడ్‌ చేయడాన్ని ఆపేయాలని సాధారణ పరిపాలనశాఖ గతంలో ఆదేశాలిచ్చింది. దీని ప్రకారం కొన్ని జిఓలు మాత్రమే గెజిట్‌లో పెట్టేశారు. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. పరిపాలనకు సంబంధించిన అంశాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటని, వాటిని బయటపెట్టేలా చూడాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. మూడున్నరేళ్ల నుండి జిఓలు అప్‌లోడ్‌ చేయడం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో విచారించిన కోర్టు జిఓలు అప్‌లోడ్‌ చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సాధారణ పరిపాలనశాఖ అధికారులు అన్ని విభాగాలకూ ఆదేశాలు పంపారు. ఎపి గెజిట్‌లో అప్‌లోడ్‌ చేసిన అనంతరం వివరాలను కేబినెట్‌ సెక్షన్‌ అధికారికి తెలపాలని పేర్కొన్నారు. గతంలోనే దీనిపై ఆదేశాలిచ్చామని, అధికారులు పట్టించుకోలేదని అందులో తెలిపారు.