
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రతి మహిళనూ వ్యాపారవేత్తగా తీర్చిదిద్ది వారి కుటుంబాల్లో ఆర్థిక సుస్థిరత, సాధికారతను తీసుకురావడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తున్నదని సెర్ప్ కార్యనిర్వహణాధికారి ఇంతియాజ్ అన్నారు. విజయవాడలోని సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి సంక్షేమ పథకాలను అందిస్తూ మహిళా సాధికారతకు విశేష కృషి చేస్తున్నదని తెలిపారు. మహిళలకు సున్నా వడ్డీ, అమ్మఒడి, వైయస్‌ఆర్ చేయూత, ఆసరా కింద నాలుగేళ్లలో 64 వేల కోట్లను వారి ఖతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. గతంలో సి, డి గ్రేడ్‌లోకి ఉన్న సంఘాలు, ఈ పథకాల సహకారంతో ఎ, బి గ్రేడ్‌లోకి చేరాయని పేర్కొన్నారు. ప్రభుత్వం క్రమం తప్పకుండా వైయస్‌ఆర్ సున్నా వడ్డీ చెల్లిస్తున్నందున గతంలో నిర్వీర్యమైన సంఘాలు తిరిగి క్రీయాశీలకంగా మారాయని అన్నారు. ప్రస్తుతం బ్యాంకులు డ్వాక్రా సంఘాలకు రూ.20 లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకు లింకేజీ ద్వారా రుణం ఇస్తున్నట్లు తెలిపారు. సంఘాలు తీసుకున్న రుణాలను చెల్లించడంలో 99.67 శాతం రికవరీతో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని అన్నారు. బిగ్ ఇంపాక్ట్ ప్రాజెక్టులో భాగంగా 16 వేల మందికి లబ్ధి చేకురేలా రూ.60 కోట్లతో 12 జిల్లాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రములు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.