
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు వున్న అలవెన్సులను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి జిఓ నెంబరు 79ని విడుదల చేశారు. పోలీసులకు దశాబ్దాలుగా కొనసాగుతున్న అలవెన్సులతోపాటు ఇతర విభాగాల్లోకి డిప్యూటేషన్‌పై వెళ్లేవారికి ప్రత్యేక అలవెన్సులు వుండేవి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ విభాగంలో పనిచేసే వారికి వున్న 30 శాతం అలవెన్స్‌ను రద్దు చేశారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే యాంటీ నక్సలిజం స్క్వాడ్ సిబ్బందికి ఇచ్చే 15 శాతం అలవెన్స్‌ను తొలగించారు. ఏజెన్సీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు అడిషనల్ హెచ్‌ఆర్‌ఎను ఈ ఉత్తర్వులతో తొలగించారు. డిప్యూటేషన్‌పై ఎసిబిలో పనిచేస్తే వున్న 30 శాతం అలవెన్స్‌ను 25 శాతానికి కుదించారు. ఎసిబిలో నేరుగా రిక్రూట్ అయినవారికి వున్న 10 శాతం అలవెన్సును 8 శాతానికి తగ్గించారు. దశాబ్దాలుగా పోలీసులకు ఇచ్చే సైకిల్ అలవెన్సుకు మంగళం పాడారు. ఈ ఉత్తర్వులతో అన్ని స్థాయిల్లోని పోలీసులకు వేతనంలో కోతలు పడనున్నాయి. అలాగే ఈ ఉత్తర్వులతో పలుశాఖలకు చెందిన ఉద్యోగుల అలవెన్సుల్లో భారీగా కోత పడనుంది.