
- పోలీస్ రిక్రూట్‌మెంటు బోర్డు ఛైర్మన్ అతుల్ సింగ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎస్‌ఐ పోస్టుల అభ్యర్థులకు అక్టోబరు 14, 15 తేదీల్లో తుది పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంటు బోర్డు ఛైర్మన్ అతుల్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షలు విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐ తుది రాత పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయని అన్నారు. రెండు పేపర్లు సబ్జెక్టు తరహా విధానంలో, మరో రెండు పేపర్లు బిట్స్ రూపంలో ఉంటాయని పేర్కొన్నారు. అక్టోబరు 14న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 411 ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, 57,923 మంది అర్హత సాధించారని, ఇందులో 56,130 మంది అభ్యర్థులకు ప్రస్తుతం ఆగస్టు 25 నుంచి విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ దేహదారుఢ్య పరీక్షలు పూర్తికాగానే తుది పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో హాల్ టికెట్ తీసుకోవాలని కోరారు.