
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నాలుగేళ్లుగా అరాచక పాలన సాగుతోందని, అవినీతి తప్ప అభివృద్ధి లేదని టిడిపి ఆరోపించింది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆ పార్టీ రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీ తొలి సమావేశం టిడిపి కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆధ్వర్యాన బుధవారం జరిగింది. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం, పోలవరం నిర్వీర్యం, అమరావతి నాశనం వంటి అంశాలను ప్రజలకు వివరించాలని తెలిపింది. యువతకు ఉపాధి కరువు, రైతులకు గిట్టుబాటు లభించకపోవడం, ఛార్జీల పెంపు, ధరల మోత, మహిళల రక్షణ వంటి అంశాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగించాలని పేర్కొంది. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు గురజాల మాల్యాద్రి, వేపాడ చిరంజీవి రావు, జివి రెడ్డి, ఎన్ విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.