Nov 07,2022 07:19

''భారతదేశంలోని సంపద సహజవొనరులపై ప్రతి మనిషికి హక్కు ఉంటుంది. వీటిని అందరూ సమానంగా అనుభవించిన రోజే ఈదేశానికి నిజమైన స్వతంత్య్రం వచ్చినట్లు ..'' - ప్రొఫెసర్‌ మధు దండావతే.
కపాకర్‌ మాదిగ రచించిన 'పంచుకుందాం రా!' కవితా సంపుటి 127 కవితల సమాహారం. 295 పేజీల పుస్తకం. ఈ కవితా సంపుటికి డా|| ఎండ్లూరి సుధాకర్‌, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, జూపాక సుభద్ర, బి.ఎస్‌.రాములు, జి.లక్ష్మీనర్సయ్య లాంటి మేధావులు ముందుమాటలు రాశారు.
కవి పొనుగోటి కృపాకర్‌ బాలకార్మికునిగా జీవితాన్ని ప్రారంభించాడు. మార్క్సిస్టు - లెనిస్టు ఉద్యమంలో ఆర్గనైజరుగా పనిచేశాడు. తరువాత మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపక కార్యదర్శిగా ప్రస్థానం కొనసాగిస్తూనే మరొకపక్క సాహిత్య రచన విస్తృతంగా కొనసాగించాడు. తన ఉద్యమ ప్రస్థానం ప్రారంభం నుంచి నేటి వరకు అనేక కవితలు, వ్యాసాలు రాశాడు. వాటిలో కొన్నింటితో పంచుకుందాం రా! కవితా సంపుటి వెలువరించారు.
''గుడిసెల్లో చమురు దీపాలు/ నీడల్ని వొణికిస్తుంటాయి/ పక్షులు వేకువని పాడతాయి/ నేను విముక్తిని, భూపాలాన్నీ/ బిగ్గరగా పాడతాను' .. ఇలా మనిషిని మనిషి తాకకూడదనే అంటరానితనమనే మాయారోగం గురించి 'కైదుపాట' కవితలో వినిపించారు. 'అంటరానితనం రాత్రిలోకి ప్రవహిస్తుంది / నన్ను లాకప్‌ చేస్తుంది/ నాకు నేను ఆయుధాన్నై పదునెక్కుతాను/ ఈ ఇరుకు గదుల్ని మళ్ళీ మళ్ళీ పగలగొడతాను' అని పేర్కొన్నాడు. ఇక్కడ ఒక ఆవేశం, ధిక్కారం కనబడుతుంది. అక్షరాలు మరఫిరంగులై, అక్షరగోళాలై దుర్మార్గమైన ఈ సమాజాన్ని హెచ్చస్తున్నాయి. ఈ కవితలో గుడిసెల్లో చమురు దీపాలు నీడల్ని వొణికిస్తుంటాయి అని కవి తను తాను దశ్యమానం చేశాడు. ఇంట్లో గుడ్డిదీపం వెలిగించుకున్నప్పుడు అది గాలికి ఊగుతూ ఉంటుంది. అప్పుడు నీడలు ఊగిసలాడక ఏం చేస్తాయి మరి? ఈ సందర్భం దళిత జీవితాలకు ప్రతీక. 'నడిచే దీపస్తంభం నాన్న' కవితలో కవి అసలు సిసలైన మాదిగ అలంకారాలను గుదిగుచ్చి పాఠకుల ముందుంచాడు. అచ్చమైన స్వచ్ఛమైన వాడ భాషను వాడాడు. కొరముట్లు, పొలిగట్టే, పొగర్రు, నిట్టాడు... ఇవి ముచ్చుకు మాత్రమే! కవితలో లీనమైన పాఠకుడు అనివార్యంగా కవితను చివరివరకు ఆస్వాదిస్తాడు.
'నువ్వు గొడ్డు తోలు వలుస్తుంటే ఏ జనరల్‌ సర్జనూ సరిపోడేమో!/ చింత గింజలు జిగురుగా ఉడకేసి, కొత్త తప్పెట పలక జేసి/ కొత్త కొత్త శైలులతో నువు దురువులు వాయిస్తుంటే చూడాలి నానా!' ఇలా హృద్యంగా చెప్పుకుంటూ పోతాడు. కరక్కాయ పరిమళాన్ని ఊరికి కిర్రు చెప్పుల లయను తన అక్షరాలతో కవిత్వం చేసి నడిపించాడు కపాకర్‌. మిగ్గొమ్మిలోంచి వచ్చిన ఆరె చురుకుదనం, పన్రాయి మీద నూరిన పనికత్తి మెరుపుదనాన్ని తన అక్షరాల్లో పొదిని పట్టుకొని తన కవిత్వాన్ని వినిపించాడు. 'పంచుకుందాం రా!' కవితలో సమాజానికి ఓ సందేశం పంపాడు. భారతదేశంలోని సంపద సహజ వనరులపై హక్కు ఈ దేశంలో పుట్టిన ప్రతివారికి ఉంటుంది కనుక ఇద్దరి మధ్య కానీ, రెండు సామాజిక వర్గాల మధ్య కానీ, అనేక సమూహాల మధ్య వివాదం సడలాలి అంటే సంపదగానీ సామాజిక ఉన్నతి కాని ఒకరి దగ్గరే పోగుపడి ఉండకూడదని కవి భావన.
'అంబేద్కర్‌ రొట్టెలో భాగం పంచాల్సిందే అంటాను గట్టిగా' అని నొక్కినొక్కాణిస్తాడు కపాకర్‌. సంపద సమ భాగాలుగా పంచుకొంటే జాతుల మధ్య ఐకమత్వం పోతుందనే మాటలు ఆసంబద్ధమైనవని కవి భావన. పంచుకోవడం వల్ల ప్రపంచం ఏమీ మునిగిపోదు. ఆఖరి బంతిలో వారు కూడా కడుపునిండా తిన్ననాడే అసలైన బాబా సాహెబ్‌ ఆలోచనా విధానం నెరవెర్చినట్టని కవి హృదయం. 'నిర్భయ' కవితలో ప్రతి వాక్యమూ ఓ ధిక్కార నిప్పుకణిక. 'రాతి కత్తితో ఈటె కట్టెతో/ ఇనుప బరెశెతో రాజ్యం చేసిన దానను/ అయినా నేను మానవిని/ మహా ఆదిని/' అంటూ స్త్రీని ఓ పరాశక్తిగా చూపించాడు కవి. 'సూర్యచంద్రులను రెండు కళ్ళగా జ్ఞానాన్ని మూడో కన్నుగా కలిగిన దానను/ మానవిని, మహా ఆదిని' అనిస్త్రీజాతిని ఆకాశమంత ఎత్తులో నిలిపాడు. సినారె, శిఖామణి, ఎండ్లూరి సుధాకర్‌, దార్ల వెంకటేశ్వరరావు, ప్రతాప్‌ కుమార్‌ .... ఇలా ఎంతోమంది కవులు అమ్మ గురించిన కవితలు రాశారు. స్త్రీని మానవిని, మహా ఆదిశక్తిగా నిలిపి చరిత్రలో నిలిచిపోయాడు కపాకర్‌.
ఓ కవి పేరు చెప్పగానే ఆయన ఉద్యమ కవనీ, లేదా రైతుకవి, దళిత కవి .. అంటూ ఏదొక ముద్ర పడుతుంది. ఈ కవితా సంపుటి చదివిన తర్వాత పాఠకులు ఈ కవిని ఏదో ఓ గాట కట్టిపడి వేయలేరు. ఇందులో పదీ పన్నెండు మాత్రమే దళిత కవితలు. మిగతావన్నీ వివిధ సామాజిక అంశాలపై రాసినవే! కృపాకర్‌ ఓ సామాజిక తత్వవేత్త, ఉద్యమాల ఉపాధ్యాయుడు. సర్వజనీన కవిత్వం తనది.

- దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి
70139 75274