బాబ్రీ మసీదు కూల్చివేత, అనంతర పరిణామాలతో అధికారంలోకి వచ్చిన బిజెపి., సంఫ్‌ుపరివార్‌శక్తుల ఆగడాలను అరికట్టడానికి సెక్యులర్ శక్తులన్నీ ఐక్యం కావాల్సి ఉందని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా వారు ప్రజాశక్తితో మాట్లాడారు. మతోన్మాదులు, కార్పొరేట్లు కలిసి ప్రజలను అన్ని విధాలా దెబ్బతీస్తూ ప్రజల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారని వారు వివరించారు. సిఎఎ, ఎన్‌ఆర్‌సి పేర్లతో మైనార్టీలను వేరు చేస్తూ పబ్బం గడుపుకునే చర్యలను ప్రతిఘటించాల్సి ఉందని వారు చెప్పారు. వారి స్పందన ఇలా.....

మత సామరస్యం అందరి బాధ్యత : విఠపు బాలసుబ్రమణ్యం, శాసన మండలిలో పిడిఎఫ్ పక్షనేత - నెల్లూరు
భారత దేశంలో శతాబ్ధాల తరబడి నెలకొన్న మతసామరస్యం, సుహుద్బావానికి తీవ్రమైన నష్టాన్ని బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన తీసుకొచ్చింది. దీంతో భారతీయ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చాలన్న శక్తులకు ఊతమిచ్చింది. ఇలాంటి సంఘటన మరొక సారి ఎట్టి పరిస్థితుల్లోనూ పునారావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మతం వ్యక్తిగతమైంది. దానిని ఆ స్థాయిలోనే ఉంచాలి. రాజకీయాలు, పరిపాలన వ్యవస్థలోకి తీసుకురావడం ఆధునిక ప్రపంచంలో ఎవరూ అంగీకరించకూడని అంశం. దాదాపు అభివృద్ధి చెందిన అన్ని సమాజాలూ దీనిని పాటిస్తున్నాయి. అయితే మన దేశంలో మాత్రం దీనికి భిన్నంగా వెళ్లే ప్రమాదం మన కళ్లముందు కనిపిస్తోంది. పనిగట్టుకొని హిందూ మతోన్మాద శక్తులు దీనికి పూనుకుంటున్నాయి. దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. సెక్యులర్ శక్తులను కూడగట్టి ఐక్యంగా నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజాస్వామిక సామరస్యపూరిత సంస్కృతికి పునాదులు మరింత బలంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం గతంలో కన్నా మనపై ఉంది. ప్రతి ఒక్కరూ మతసామరస్యానికి బాధ్యతగా ఉండాలి.

మతాధిపత్యం దేశభక్తి అనిపించుకోదు : రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత - అనంతపురం
మతాధిపత్యం ఏ రకంగానూ దేశభక్తి అనిపించుకోదు. 'అన్నదమ్ముల వలె జాతులు, మతములన్నీయు మెలగవలెనోయి' అన్న గురజాడ సూక్తి నేటికీ సరిగ్గా సరిపోతుంది. అనేక మతాలు సహజీవనం చేస్తున్న సమాజంలో మత సహనం, సామరస్యం రెండు మార్గాలు. మత సంఘర్షణలు, అసహనమన్నది అనాగరికతకు, కుంస్కారానికి సంకేతాలు. మత సామరస్యాన్ని అనుసరించడమే నిజమైన దేశభక్తి. భారత దేశం బహుళత్వ నిలయం. దీన్ని ఒంటిస్తంభపు మేడగా మార్పు చేయడం తగదు. ఒక మతం మరో మతం మీద... ఒక కులం మరో కులం మీద...ఒక ప్రాంతం మరో ప్రాంతం మీద..ఒక వర్గం ఇంకో వర్గంపై ఆధిపత్యం చెలాయించాలనుకోవడం ప్రజాస్వామ్యం కాదు. భారతదేశం ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంది. మత ఘర్షణలు, విద్వేషాలు మౌలిక సమస్యల పరిష్కారానికి అవరోధంగా మారుతాయి.

లౌకిక శక్తులు ఏకం కావాలి : హెనీ క్రిస్టినా, గుంటూరు జడ్‌పి చైర్‌పర్సన్
సమాజంలోని ప్రజాసంఘాలు, సాంస్కృతిక సంఘాలు, మేథావులు, విద్యావేత్తలంతా దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నా మతతత్వాన్ని ఎదుర్కొనేందుకు తగిన కార్యచరణ కొరవడింది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐక్యవేదికలు ఏర్పాటు చేసి ప్రజలల్లో చైతన్యం తెస్తూ మతతత్వ శక్తులను ఎదుర్కోవాల్సి ఉంది. లౌకిక విధానాల ద్వారానే భారత దేశ భిన్నత్వం కాపాడబడుతుంది. రాజ్యంగ నిర్మాతలు రాజ్యంగంలో మత స్వేచ్ఛకు, లౌకిక వాదానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మత సామరస్యం కొనసాగాలని ఆకాక్షించారు. కానీ ప్రస్తుతం మతతత్వ శక్తులు ప్రజలను మతపరంగా విభజించడం ద్వారా మత సామరస్యానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయి. గుంటూరులో 100 ఏళ్ల క్రితం నిర్మించిన జిన్నాటవర్ పేరు మార్చాలని కొంత మంది బిజెపి నాయకులు అలజడి సృష్టించడానికి ప్రయత్నించగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టింది. అన్ని మతాలనూ, కులాలనూ పరస్పరం గౌరవించే సంస్కృతి ఉన్న దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టాలన్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి.

రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే కుట్ర : అఫ్సర్, ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి - విజయవాడ
మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత మతోన్మాదాన్ని ప్రజలపై రుద్దుతున్నారు. దీనిలో భాగంగానే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఒక వర్గంపై పనిగట్టుకని విష ప్రచారం చేస్తున్నారు. దానికి కొనసాగింపుగా దాడులు, హత్యలు చేస్తున్నారు. విద్వేష ప్రసంగాలు చేయడంలో భారతదేశం మొదటిస్థానంలో ఉందని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. ప్రపంచ దేశాల్లో ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. కోర్టులు, న్యాయవ్యవస్థలు కూడా ఒక వర్గం కొమ్ముకాసే విధంగా తీర్పులు ఇస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. ఇటీవల సిఎఎ పేరుతో ఒకవర్గాన్ని దేశ ప్రజల నుండి వేరుచేసే విధంగా కేంద్రం వ్యవహారం నడుపుతోంది. తొమ్మిది రాష్ట్రాల్లోని 31 జిల్లాల్లో 1414 మందికి దేశం పౌరసత్వం కల్పించింది. వారిలో ఒక్కరంటే ఒక్కరూ ముస్లిం మైనార్టీ లేరు. దేశంలోని 14 సంవత్సరాలకుపైబడి నివశించిన వారికెవరికైనా రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం కల్పించవచ్చు. కానీ అటువంటి చర్యలేమీ కేంద్రం తీసుకోకపోగా ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది. అయోధ్య కథ ముగిసిన తరువాత ఇప్పుడు కొత్తగా తాజ్‌మహల్, అజ్మీర్ దర్గాలను తవ్వాలని కేంద్రంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న కొంతమంది నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. కానీ కోర్టులను ఆశ్రయించినా వారికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సిద్ధపడటం లేదు. చట్టం ప్రకారం నడుచుకోవాలి. ఇటీవల కాలంలో ఒక మతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆచరణలో లౌకికతత్వం అనే పదాన్ని వినడానికి కేంద్ర పెద్దలు ఉద్ధేశ్యపూర్వకంగానే ఇష్టపడడం లేదు. ఇప్పటికైనా కేంద్రం లౌకికతత్వాన్ని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తం : ఎం.ఎ.చిష్టీ, ఆవాజ్ రాష్ట్ర కన్వీనర్ -గుంటూరు
బాబ్రీమసీదు కూల్చివేత, దేశ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే ఫాసిస్టు శక్తులు, కార్పొరేట్ శక్తులు రెండూ మిలాఖత్ అయి దేశాన్ని పరిపాలిస్తున్నాయి. ఫాసిస్ట్ శక్తులు మతోన్మాదాన్ని రెచ్చగొడితే కార్పొరేట్ శక్తులు ఆర్థిక దోపిడీ చేస్తున్నాయి. విశ్వాసాల ఆధారంగా న్యాయస్థానం తీర్పునైతే ఇచ్చింది కానీ న్యాయం జరగలేదు.ఈ తీర్పు లౌకికవాదాన్ని, మతసామరస్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టివేసేలా ఉంది. దేశాన్ని విభజించే విచ్ఛిన్నకర, మతోన్మాద శక్తులు ఐక్యమై ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా దేశ సమైక్యత, సమగ్రతలను కోరే లౌకిక అభ్యుదయ శక్తులు ఏకమవ్వాలి. మత సామరస్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న శక్తులను ప్రజలే తిప్పికొట్టాలి. అందుకు భావజాలరంగంలో అభ్యుదయ వాదులూ, మేధావులు గట్టి కషి చేయాల్సిన అవసరం ఉంది. జాతీయోద్యమ స్ఫూర్తితో లౌకిక సామ్యవాద భావజాల వ్యాప్తి కోసం సాంస్కతిక రంగంలో కూడా కషి చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో మతసామరస్యం పెంపొందించడానికి అభ్యుదయ శక్తులు ఏకమవ్వాలి. ప్రజల్లో చైతన్యం తెస్తూ మతతత్వ శక్తులను ఎదుర్కోవాలి. ఆ విధంగా భిన్నత్వంలో ఏకత్వం అయిన మన వారసత్వాన్ని, ప్రజా పోరాటాలు, ఉద్యమాల ద్వారానే మనం కాపాడుకోగలం.విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడి మతసామరస్యాన్ని కాపాడుకోగలం.










