Sep 20,2023 09:13
  • ఐరాస జనరల్‌ అసెంబ్లీ 78వ వార్షిక సమావేశాల ప్రారంభ వేడుకలో నేతల పిలుపు

న్యూయార్క్‌ : సమైక్యతతో వ్యవహరిస్తూ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలను అధిగమించాలని, అభివృద్ధి లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని ప్రపంచ నేతలు కోరారు. ఇక్కడ జరుగుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ (యుఎన్‌జిఎ) 78వ సమావేశాలకు నేతలు విచ్చేశారు. శుక్రవారం వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
           ఐక్యరాజ్య సమితి విధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను పేర్కొంటూ అభివృద్ధిపై, వాతావరణ మార్పులపై పేద, వర్ధమాన దేశాలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. కాగా మరోవైపు, అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు మాత్రం ఉక్రెయిన్‌ సంక్షోభంపై చీలికలు తీసుకురావడానికి ఈ బహుళ వేదికను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాయి. దాంతో కరోనా తర్వాత మొదటిసారిగా జరిగిన పూర్తి స్థాయి సమావేశాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
        అనేక వర్ధమాన దేశాలు తీవ్రమైన అభివృద్ధి సవాళ్ళను ఎదుర్కొంటున్న నేప థ్యంలో ఐక్యరాజ్య సమితి 2030 ఎజెం డా, దాని సుస్థిర అభివృద్ది లక్ష్యాలపై శీఘ్రగతిన కార్యాచరణ ఎలా వుండాలనే దానిపై ఈ ఏడాది సమావేశాల్లో ప్రధానం గా దృష్టి పెట్టాల్సి వుంది. అయితే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమావేశాలకు హాజరు కావడంతో అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల కూటమి, అభివృద్ధిని భౌగోళిక రాజకీ యాలకు ముడిపెట్టడానికి ప్రయత్నించిం ది. దాంతో ఇతర దేశాలు కూడా తమకు కావాల్సిన పక్షం వైపునకు వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయని నిపుణులు పేర్కొంటున్నారు.
          ''ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు ప్రజలు తమ నేతల వైపు చూస్తున్నారు.'' అంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ సమావేశాలకు ముందు వ్యాఖ్యానించారు. బహుళ రకాలైన సంక్షోభాలు, ఘర్షణలను ప్రతిబింబించేలా ఈ ఏడాది సమావేశాల్లో 145మంది నేతలు ప్రసంగించనున్నారు. అధ్వాన్నమవుతున్న వాతావరణ మార్పులు, పెరుగుతున్న అంతర్జాతీయ జీవన వ్యయ సంక్షోభం, నాటకీయమైన సాంకేతిక అవాంతరాలు వంటి పలు సవాళ్ళను ఎదుర్కొంటున్న నేటి పరిస్థితుల్లో మాటల కన్నా చేతలకే ప్రాధాన్యత వుండాలని గుటెరస్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ విభజనలనేవి ప్రతిస్పందించే సామర్ధ్యాన్ని దెబ్బ తీస్తున్నాయని అన్నారు.
 

                                 నిజాయితీతోకూడిన బహుళవాదాన్ని పరిరక్షించుకోవాలి : చైనా ఉపాధ్యక్షుడు

గత శతాబ్ద కాలంలోనే ఎన్నడూ లేనంతగా వేగవంతమైన మార్పులను ఈనాడు ప్రపంచం చూస్తోంది. ఇందుకు అనేక అస్థిరమైన, అనిశ్చితితో కూడిన కారణాలు పెనవేసుకున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితి చాలా సంక్లిష్టంగా, విషాదంగా వుంది. ఇటువంటి పరిస్థితుల్లో నిజాయితీతో కూడిన బహుళవాదాన్ని, పటిష్టమైన ఐక్యరాజ్య సమితిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని చైనా ఉపాధ్యక్షుడు హన్‌ ఝెంగ్‌, యుఎన్‌ చీఫ్‌ గుటెరస్‌తో మాట్లాడుతూ చెప్పారు. చైనా ఎల్లప్పుడూ ప్రపంచ శాంతి నిర్మాతగా, ప్రపంచ అభివృద్ధికి దోహదకారిగా, అంతర్జాతీయ వ్యవస్థ పరిరక్షకురాలిగా వుంటుందని హన్‌ చెప్పారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఐక్యరాజ్య సమితి కీలక పాత్ర పోషించేందుకు మద్దతునిస్తుందన్నారు.
           సమావేశాలకు ఎవరు వస్తున్నారు, ఎవరు రావడం లేదనే అంశాలకు ప్రాధాన్యతనివ్వకుండా చేసిన హామీలను ప్రభుత్వాలు ఎంతవరకు ఎలా నెరవేరుస్తున్నాయో చూడడంపైనే దృష్టి పెట్టడం ముఖ్యమని అన్నారు. పశ్చిమ దేశాలు, వర్ధమాన దేశాల మధ్య వ్యత్యాసాలు, మరికొన్ని సార్లు ఉద్రిక్తతలనేవి ఈ ఏడాది సమావేశాల ప్రణాళికలో ప్రధాన కారకంగా వున్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది. అమెరికా, దాని యురోపియన్‌ మిత్రపక్షాలు రష్యా, చైనాలతో విసిగిపోయి, వర్ధమాన దేశాలతో సంబంధాలను పటిష్టపరుచుకోవాలని నిర్ణయించుకు న్నాయని టైమ్స్‌ పేర్కొంది.