కొంతమంది స్వార్ధ ప్రయోజనాల కోసం రాజేసిన చిచ్చులో ఒక పక్క రాష్ట్రమంతా రెండు వర్గాల ఘర్షణలతో అట్టుడికిపోతుంటే మరోపక్క అవే రెండు వర్గాలు కలిసిమెలసి జీవిస్తూ.. మేం స్నేహితులం.. బంధువులం. మా మధ్య చిచ్చు పెట్టాలని చూసే వారిని మా గ్రామాల్లోకి కూడా రానీయమంటూ కంచె వేసుకుని ఉన్నారు. ఆ రాష్ట్రం మణిపూర్.. ఆ గ్రామం క్వాతా..

గ్రామంలోకి అడుగుపెడుతుంటే.. 'మేం శాంతిని కోరుకుంటున్నాం' అన్న అక్షరాలతో తెల్ల కాగితం మీద రాసిన ఓ నేమ్ బోర్డు గ్రామం మొదట్లో ఉన్న వెదురు తడికెకి వేలాడుతూ కనిపిస్తోంది. మణిపూర్ తెంగ్నోపాల్ జిల్లా ఖోబోలో నిర్మలమైన కొండల్లో ఈ గ్రామం ఉంది. గ్రామం చుట్టూ ఆరు కుకీ, మూడు నాగా గ్రామాలు ఉన్నాయి. మే 3న ప్రారంభమైన హింసాత్మక దాడులతో రెండు నెలలుగా రాష్ట్రమంతా హింసాత్మక దాడులు చెలరేగుతున్నాయి. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితిలో ఆ గ్రామం ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా కనపడుతోంది.
రాష్ట్రంలో మిగిలిన చోట్ల మెయితీల్లో ఉన్న అభద్రతా భావం గ్రామంలో ఉన్న మెయితీల్లో కనిపించడం లేదు. చాలా స్వేచ్ఛగా, పూర్తి రక్షణలో జీవిస్తున్నారు. 'మేమంతా ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నాం. స్నేహితుల్లా మెలగుతున్నాం. ఇరువర్గాల పిల్లలను వివాహబంధంతో కలుపుకుని బంధువులయ్యాం. అంతరాలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నాం. మా మధ్య ఎవరూ చిచ్చు పెట్టలేరు' అంటున్నాడు గ్రామ నివాసి టి సంజరు సింగ్.
గ్రామంలో 103 ఇళ్లు ఉంటే 302 మంది నివసిస్తున్నారు. వారిలో మైనార్టీగా ఉన్న మెయితీలు హింస ప్రారంభమైన మొదటిరోజున గ్రామం వదిలి వెళ్లిపోదామని నిశ్చయించుకున్నారు. ఆ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల్లోని కుకీ వర్గం మెయితీల భయాన్ని పోగొట్టేలా వారికి రక్షణగా ఉంటామని చెప్పింది. 'ఇప్పటికీ మాకు లోయ ప్రాంతం నుండి మా బంధువులు ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఇబ్బందికర పరిస్థితులేమైనా తలెత్తాయా.. కుకీలు నుండి హాని కలుగుతుందా అంటూ ఆరా తీస్తున్నారు' అంటున్నాడు ఓ మెయితీ సభ్యుడు. 'లోయలో జరుగుతున్న హింస గురించి మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోన్న గ్రామంలో మాత్రం చాలా భిన్న వాతావరణం ఉంది. మేం ఇక్కడ చాలా భద్రతలో ఉన్నాం' అంటున్నాడు అతడు.

గ్రామం వెలుపల కూడా..
మెయితీలకు రక్షణగా ఉంటామని తీర్మానించుకున్న ఆ గ్రామస్తులు గ్రామం వెలుపల కూడా వారికి భద్రత కల్పిస్తున్నారు. అవసరమైన వస్తువులు, వైద్య చికిత్స కోసం ఇంఫాల్ వెళ్లే మెయితీలకు మేం రక్షణ కల్పిస్తున్నాం' అంటున్నారు గ్రామపెద్ద కిషోర్. గ్రామం నుండి ఇంఫాల్ వెళ్లే మార్గంలో ఆరు కుకీ గ్రామాలు ఉన్నాయి. వాటి గుండా వెళ్లేటప్పుడు వాళ్లపై ఎటువంటి దాడులు జరగకుండా చూసుకుంటున్నారు. 'ఈ నెల మొదట్లో మెయితీలకు చెందిన ఓ గర్భిణీ చికిత్స కోసం ఇంఫాల్ హాస్పటల్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆర్మీ ఏర్పాటు చేసిన వాహనంలో ఆమె బయల్దేరేందుకు ధైర్యం చేయడం లేదు. అప్పుడు మాలో కొంతమంది ఆ వ్యానులో ఆమెతో పాటు ప్రయాణించాం' అంటున్నాడు కిషోర్.
'మా గ్రామం 700 ఏళ్ల క్రితం ఏర్పడింది. మా తాత, ముత్తాతల కాలం నుండి మేం ఇక్కడే ఉంటున్నాం. రెండు వర్గాలకు చెందిన వాళ్లం కలిసిమెలిసి ఉన్నాం. కలిసే పెరిగాం.. పండుగలు చేసుకున్నాం. కష్టం వచ్చినా, సంతోషమేసినా కలిసే అనుభవించాం. లోయలో హింస చెలరేగుతున్నప్పటి నుండి మేము తరచూ కుకీలతో చర్చలు నిర్వహిస్తున్నాం. మా గ్రామం చరిత్ర, మెయితీలతో మాకున్న అనుబంధం గురించి మాట్లాడుతున్నాం. మేము వాళ్లకి హానీ చేయలేదు. వాళ్లు మమ్మల్ని హింసించలేద'ని అంటోంది గ్రామంలోని కుకీ వర్గానికి చెందిన ఓ మహిళ.
కులం, జాతి, మతం, భూమి, నీరు పేరుతో కొంతమంది రాజేస్తున్న ద్వేషానికి దేశంలో ఎక్కడో ఓ చోట ఘర్షణలు తలెత్తుతూనే ఉంటాయి. మణిపూర్ హింస కూడా అటువంటి ప్రేరేపిత చర్యే.. అటువంటి చోట ఎడారిలో ఒయాసిస్సులా క్వాతా గ్రామం కనపడుతోంది. ఘర్షణ ప్రాంతాలకు దిక్సూచిలా నిలుస్తోంది.










