Jan 11,2023 11:40
  • ప్రభుత్వ బకాయిలపై వివరణ
  • రూ.3,937 కోట్లకు చేరినట్లు ఇఆర్‌సి నివేదికలో వెల్లడి

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : 'ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు' విద్యుత్తు పంపిణీ సంస్థల పరిస్థితి తయారైంది. ప్రభుత్వం వివిధ తరగతులకు ఇస్తోన్న విద్యుత్తు రాయితీలను పంపిణీ సంస్థలకు చెల్లించకపోవడంతో అవి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాయితీలను సకాలంలో చెల్లించకపోయినా ఎప్పటికప్పుడు చెల్లిస్తోందని ప్రభుత్వ పరువుపోకుండా దాచిపెడుతూ వచ్చిన విద్యుత్తు సంస్థలు... 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి (ఎపిఆర్‌సి)కి సమర్పించిన సమగ్ర ఆదాయావసరాల నివేదిక (ఎఆర్‌ఆర్‌)లో మాత్రం వాస్తవాలు చెప్పకతప్పలేదు. ఎపిఇఆర్‌సికి ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎపిఇపిడిసిఎల్‌) సమర్పించిన నివేదికలో వివిధ తరగతులకు ప్రభుత్వం ఇస్తోన్న రాయితీల కింద ఈ ఆర్థిక సంవత్సర మొదటి అర్ధభాగానికి రూ.3,937.90 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంది. వ్యవసాయ విద్యుత్తు పంపుసెట్లు, ఎస్‌సి, ఎస్‌టి గృహ వినియోగదారులకు, ఆక్వా రైతులు, చేనేత కార్మికులు, హెయిర్‌ కట్టింగ్‌ సెలూన్లు తదితర బిపిఎల్‌ పరిధిలోని వృత్తిదారులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తు, రాయితీలు ఇస్తోంది. వీటికి అయ్యే విద్యుత్తు వినియోగ ఛార్జీలు మొత్తం విద్యుత్తు సరఫరా చేసిన పంపిణీ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. విద్యుత్తు రాయితీలు ఇస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఆ విద్యుత్తును సరఫరా చేసిన ఇపిడిసిఎల్‌కు మాత్రం డబ్బులు సరిగా చెల్లించడం లేదు. 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి ఇపిడిసిఎల్‌కు రూ.1187.37 కోట్లు బకాయిని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2022-23 అర్ధ సంవత్సరానికి అది రూ.3937.90 కోట్లకు పెరిగింది. మధ్యమధ్యలో కొద్దొగొప్పో విడుదల చేయడం తప్ప, రాయితీ మొత్తాన్ని సంస్థకు చెల్లించడం లేదు. టారిఫ్‌ సబ్సిడీ కింద గృహ వినియోగదారులకు, వ్యవసాయ పంపుసెట్లకు ఇస్తోన్న విద్యుత్తు రాయితీ అత్యధిక భాగం పేరుకుపోయింది. 2020-21 ఆర్థిక సంవ్సతరానికి ముందు రూ.734.84 కోట్లు ప్రభుత్వ బకాయి ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి రూ.3018.26 కోట్లు రావాల్సి ఉండగా రూ.727.06 కోట్లు చెల్లించింది. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో సాధారణ డిమాండ్‌ కంటే కొద్దిగా ఎక్కువ చెల్లించినప్పటికీ, పాత బకాయిలు పూర్తిగా చెల్లించకపోవడంతో చివరికది రూ.2,837.97 కోట్లకు చేరింది. జగ్జీవన్‌ జ్యోతి స్కీంలో భాగంగా ఎస్‌సిలకు ఇస్తోన్న సబ్సిడీల కింద రూ.247.91 కోట్లు, ఎస్‌టిలకు ఇస్తోన్న సబ్సిడీల కింద రూ.115.84 కోట్లు, ఆక్వా రైతులకు ప్రోత్సాహకం కింద ఇస్తోన్న విద్యుత్తు రాయితీ బకాయి రూ.735.14 కోట్లు ప్రభుత్వం నుంచి ఇపిడిసిఎల్‌కు రావాల్సి ఉంది. చేనేత, సెలూన్‌, ఇతర వృత్తిదారులకు ఇస్తోన్న విద్యుత్తు రాయితీల కింద కోటీ నాలుగు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఇపిడిసిఎల్‌ ఆర్థిక పరిస్థితి ఆశించినంత బాగాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం రాయితీల బకాయిలు పేరుకుపోవడంతో అది మరింత ఇబ్బందుల్లోకి వెళ్తోంది. ప్రభుత్వ సబ్సిడీ బకాయి రూ.3937.90 కోట్ల విషయాన్ని ఇపిడిసిఎల్‌ సిఎమ్‌డి సంతోషరావును అడగ్గా, ప్రభుత్వ బకాయిలేమీ లేవని చెప్పారు. ఎపిఇఆర్‌సికి సమర్పించిన నివేదికలో పేర్కొన్న విషయం గుర్తు చేయగా తరువాత మాట్లాడతానంటూ సమాధానం దాటవేశారు.