- అంత ఖర్చు భరించలేక వదిలేసిన ప్రభుత్వం
- రిజర్వాయర్ల నుండి నీటి తరలింపు, లైన్ల నిర్వహణ భారమే
- వాటర్ గ్రిడ్ అంచనా రూ.46 వేలకోట్లు
- రూ.5000 కోట్లతో ప్రస్తుతం ఎక్కడికక్కడ చిన్న ప్రాజెక్టులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన వాటర్ గ్రిడ్ ఇక లేనట్టే. రిజర్వాయర్ల నుండి ప్రజలకు నీటిని అందించాలనే ఉద్దేశంతో 2019లో ప్రకటించిన ఈ పథకాన్ని నిధులు లేవనే పేరుతో పక్కనబెట్టేశారు. దీనికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు నాబార్డు కూడా విముఖత చూపడంతో ప్రభుత్వానికి నిధులొచ్చే మార్గం కనిపించలేదు. పైస్థాయిలో అతికొద్దిమంది అధికారులకు మాత్రమే ఈ విషయంపై స్పష్టత ఉంది. అయితే ఇంకా ఈ ప్రాజెక్టు వస్తుంది, స్వచ్ఛమైన నీరు అందుతుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం బయటకొచ్చింది. వాటర్‌గ్రిడ్‌ను పక్కనబెట్టేసిన ప్రభుత్వం దానిస్థానంలో ఎక్కడికక్కడ చిన్న చిన్న పథకాలను ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రభుత్వం డబ్బులు లేక పక్కన బెట్టేసిన అతిపెద్ద ప్రాజెక్టు ఇదే కావడం మరో విశేషం.
రాష్ట్ర ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు నిరంతరం (వాటర్ సస్టెయినబిలిటీ) అందించాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ చేపట్టామని 2019 అక్టోబరు 11న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇది 2022 అక్టోబర్‌నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పోలవరం, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రధాన ప్రాజెక్టుల నుండి తాగునీటిని అన్ని ప్రాంతాలకూ ముఖ్యంగా సమస్య ఉన్న ఏరియాలకు పైపులైన్ల ద్వారా తరలించాలనేది ఈ గ్రిడ్ ప్రధాన ఉద్దేశం. అలాగే 30 ఏళ్లపాటు 46,982 గ్రామీణ నివాస ప్రాంతాలకు, 99 పట్టణ ప్రాంతాలకు రెండు దశల్లో తాగునీటిని అందించాలనేది ప్రధాన లక్ష్యం. మొదటిదశలో రూ.37,475 కోట్లు, రెండోదశలో రూ.9,200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు.
- రూ.5000 కోట్లకు పనుల కుదింపు
గతేడాది శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం, కర్నూలు జిల్లా డోన్, కడప జిల్లా పులివెందుల, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సిఎం శంకుస్థాపన చేశారు. ఇప్పుడు వాటర్‌గ్రిడ్‌ను పక్కనపెట్టి విడివిడిగా చిన్న ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో ఉద్దానం, డోన్, పులివెందులలో మాత్రమే పనులు జరుగుతున్నాయి. ఇవి కాకుండా పల్నాడు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో టెండర్లు ఇచ్చారు. వీటిల్లో ఒక్కో ప్రాజెక్టు విలువ సుమారుగా రూ.1000 కోట్ల నుండి రూ.1200 కోట్ల వరకూ ఉంటుంది. కొన్ని తక్కువగానూ ఉన్నాయి. మొత్తంగా రూ.5000 కోట్లతో ప్రాజెక్టును ముగించేయాలని నిర్ణయించారు.
- వెనక్కు తగ్గిన నాబార్డు
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు నిధులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నాబార్డును కోరగా తొలుత అంగీకరించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.630 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రూ.1200 కోట్లు నిధులిచ్చింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు వాడుకుంది. దీనిపై నాబార్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో వాటర్‌గ్రిడ్‌కు నిధులు ఇచ్చే అంశంపై విముఖత వ్యక్తం చేసింది. ఎడిబి నుండి కూడా రావాల్సిన నిధులు రాకపోవడంతో ఇక ప్రాజెక్టు చేపట్టడం కష్టమనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం.
- సర్వేల పేరుతో కాలయాపన
ప్రస్తుతం పనులు కేటాయించిన ఆరుచోట్ల కూడా పనులు మొదలవలేదు. ముందు టెండర్లు స్వీకరించినా ప్రభుత్వం నుండి నిధులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఆలోచనలో పడ్డారు. దీంతో గ్రౌండ్ రియాలిటీ, ఫిజుబిలిటీ, నేలస్వభావం, టెక్నికల్ అంచనాల పేరుతో రకరకాల రిపోర్టులు తీసుకోవాలంటూ కాలయాపన చేస్తున్నారు. అవి మొదలవుతాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోతోందని, అటువంటప్పుడు పనులు చేస్తే నష్టపోతామన్న భావన కాంట్రాక్టర్లలో నెలకొంది. రెండు పెద్ద సంస్థలు మాత్రం ఉన్నంతలో మెల్లిగా పనులు సాగదీస్తున్నాయి.










