Aug 07,2023 08:49

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : విప్లవ కవి గద్దర్‌ (గుమ్మడి విఠల్‌రావు) (74) ఇకలేరు. గతకొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్‌ అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో ఈ నెల 3న వైద్యులు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేశారు. అనంతరం పోస్ట్‌ సర్జరీ సమస్యలతోపాటు ఊపిరితిత్తులు, యురినరీ ఇన్‌ఫెక్షన్‌తో గద్దర్‌ ఆరోగ్యం మరింత క్షీణించి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు పిల్లలు (సూర్యుడు, చంద్రుడు, వెన్నెల) ఉన్నారు. గద్దర్‌ 1949లో తూప్రాన్‌లో జన్మించారు. నిజామాబాద్‌, హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్‌ ప్రముఖులు. ప్రజాసమస్యలపై పోరాడడమే కాకుండా తనదైన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఉద్యమానికి ఊపు తెచ్చారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌ పోరాడారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. 'మా భూమి' చిత్రంలో నటించిన గద్దర్‌... పలు సినిమాలకు పాటలు రాశారు. 'నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా...' పాటకు నంది అవార్డు ప్రకటించినా ఆయన తిరస్కరించారు. గద్దర్‌ మరణవార్త తెలియగానే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఎల్‌బి స్టేడియంకు తరలించారు. తెలంగాణ మంత్రులు జగదీష్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీలు కవిత, గోరేటి వెంకన్న, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, సాహితీ స్రవంతి ఎపి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి, పలువురు ఎమ్మెల్యేలు... గద్దర్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. గద్దర్‌ అంత్యక్రియలు అల్వాల్‌ భూదేవి నగర్‌లోని మహాభారతి విద్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. గద్దర్‌ మృతి పట్ల తెలంగాణ సిఎం కెసిఆర్‌, గవర్నర్‌ తమిళి సై, పలువురు మంత్రులు, సినీ, ఇతర రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తన జీవిత కాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌ తెలంగాణ గర్వించే బిడ్డ అని సిఎం కెసిఆర్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన చేసిన ప్రజాసేవకు గౌరవ సూచికంగా అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామన్నారు. తన పాటలతో పేదల్లో చైతన్యాన్ని నింపి వారి హక్కుల సాధనకు ఉద్యమబాట పట్టిన మహాన్నత వ్యక్తి గద్దర్‌ అని ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
           గద్దర్‌ మృతి పట్ల సిపిఎం సంతాపం ప్రకటించింది. సిపిఎం నిర్వహించిన అనేక ప్రజా ఉద్యమాలకు ఆయన మద్దతిచ్చారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, తమ్మినేని వీరభద్రం గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు. గద్దర్‌ తన పాటలు, కళారూపాల ద్వారా అట్టడుగు వర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంత పేదలను భూస్వాములు, పెత్తందార్ల దోపిడీకి వ్యతిరేకంగా సమీకరించారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ తన సంతాప సందేశంలో తెలిపారు. గద్దర్‌ మృతితో విప్లవ గళం మూగబోయిందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, సిపిఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి, సినీనటులు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాపాటల రచయితగా తనదైన శైలిలో రచించి గళమెత్తిన గద్దర్‌ లేనిలోటు పూడ్చలేనిదని సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి, అధ్యక్షులు కెంగార మోహన్‌, ప్రధాన కార్యదర్శి సత్యరంజన్‌ పేర్కొన్నారు. సంతాపం తెలిపిన వారిలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి.వెంకటేశ్వర్లు, ప్రజానాట్యమండలి అధ్యక్ష, కార్యదర్శులు పి.మంగరాజు, ఎస్‌.అనిల్‌కుమార్‌, ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి, ఎపి కౌలు రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు, కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఒ.నల్లప్ప, అండ్ర మాల్యాద్రి తదితరులు ఉన్నారు.