Jul 18,2023 12:32
  •  ప్రభుత్వం ద్వారా తక్షణమే కొనుగోళ్లు చేయాలి
  • ఎపి రైతుసంఘం పూర్వ అధ్యక్షులు బి తులసీదాస్‌
  •  కాశీబుగ్గలో 28న నిరాహార దీక్ష

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, పలాస : జీడి పంటకు మద్దతు ధర ప్రకటించి తక్షణమే రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని ఎపి రైతుసంఘం పూర్వ అధ్యక్షులు బి తులసీదాస్‌ డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని కాశీబుగ్గ సంతమైదానంలో జీడి రైతుసంఘం ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు జీడి రైతులకు మేలు చేసే పద్ధతులను అనుసరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడం లేదని విమర్శించారు. జీడి పంటకు మద్దతు ధర, ఆర్‌బికెల ద్వారా కొనుగోళ్లు వంటి డిమాండ్లతో ఈ నెల 28న కాశీబుగ్గలో 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. జీడి విస్తరణ, దిగుబడులు, జీడి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు భరోసానిచ్చే ఆదర్శవంతమైన కేరళ తరహాలో జీడి కార్పొరేషన్‌ లేదా బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జీడిపప్పుపై 12 శాతం జిఎస్‌టి, జీడిపిక్కలపై ఐదు శాతం నుంచి 2.5 శాతం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు వంటి విధానాలతో మోడీ ప్రభుత్వం జీడి రైతులను నాశనం చేసిందని విమర్శించారు. జీడి పంటకు మద్దతు ధర, ప్రభుత్వపరంగా కొనుగోళ్లపై టిడిపి తన వైఖరిని చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పండించే జీడి పంటనంతటినీ టిటిడితో పాటు అన్ని దేవస్థానాలు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అప్పుడే పంటకు మార్కెటింగ్‌ గ్యారంటీ వస్తుందని అన్నారు. ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ వ్యాపారులు, దళారుల మోసం వల్ల అటు వినియోగదారులకు, ఇటు పంట పండిస్తున్న రైతులకు నష్టం కలుగుతోందన్నారు. ధరల స్థిరీకరణ కోసం రూ.మూడు వేల కోట్లు కేటాయించామని చెప్తున్న ప్రభుత్వం, ఆర్‌బికెల ద్వారా ఎందుకు కొనుగోలు చేయడంలేదని ప్రశ్నించారు. జీడి రైతులు జోరు వానలో సైతం తమ ధర్నాను కొనసాగించారు. ఉద్దానం ప్రాంతంలోని పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రైతులు తరలివచ్చారు. జీడి రైతుసంఘం కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి కె మోహనరావు తదితరులు పాల్గొన్నారు.