Jun 26,2023 00:50

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిగ్రీ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయకపోవడంతో ప్రవేశాల గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. ప్రవేశాల గడువును జులై 5 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మూడేళ్లకొకసారి డిగ్రీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2023-24, 2024-25, 2025-26 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజులను నిర్ణయించి ఎపి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో అడ్మిషన్ల గడువును పెంచుతూ ఎపి ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి 30 వరకు జరగాల్సిన వెబ్‌ ఆప్షన్లను జులై 7 నుంచి 12 వరకు జరగనున్నట్లు తెలిపింది. జులై 3న ఉండాల్సిన సీట్ల కేటాయింపును జులై 16కు మార్చింది. జులై 4న ప్రారంభం కావాల్సిన కళాశాలలను జులై 17కు వాయిదా వేసింది.