ఒక్కరోజు చదివినా మొత్తం ఫీజు చెల్లించాల్సిందే : తెలంగాణలో ప్రయివేటు కాలేజీల ఇష్టారాజ్యం..!
- మరో కాలేజీలో జాయిన్ అయ్యేందుకు మెలిక
- టిసి, మెమో ఇవ్వకుండా ఇబ్బందులు
- ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : మేడ్చల్‌కు చెందిన ఓ విద్యార్థి ఓ ప్రయివేటు జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఐదు రోజులు కాలేజీకి వెళ్లాడు. వ్యక్తిగత కారణాల రీత్యా మరో కాలేజీలో చేరాలనుకున్నాడు. టిసి, పదో తరగతి మెమో కావాలని కాలేజీలో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటికే కొంత ఫీజు చెల్లించగా.. మిగిలిన ఫీజు మొత్తం చెల్లిస్తేనే టిసి, మెమో ఇస్తామని కాలేజీ యాజమాన్యం మెలిక పెట్టింది. దాంతో ఆ విద్యార్థి ఫీజు మొత్తం చెల్లించి మరో కాలేజీలో చేరాల్సి వచ్చింది.
కుత్బుల్లాపూర్‌కు చెందిన మరో విద్యార్థి ఓ జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇతను కేవలం రెండ్రోజులు మాత్రమే కాలేజీకి వెళ్లాడు. అనుకోని కారణాలతో మరో కాలేజీలో చేరాలనుకున్నాడు. టిసి, మెమో అడిగితే మొత్తం ఫీజు చెల్లిస్తేనే ఇస్తామనడంతో గత్యంతరం లేక చెల్లించాడు. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సామాన్యుడు కుస్తీ పడుతుంటే, మరోవైపు పిల్లల చదువులు, వారి ఫీజులు గుండె గుబేల్‌మనిపిస్తున్నాయి. చదువులపై తల్లిదండ్రుల్లో నెలకొన్న మానసిక పరిస్థితిని ఆధారం చేసుకుని తెలంగాణలోని ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. జాయిన్ చేయించుకునే వరకు సుతిమెత్తగా మాట్లాడుతూ.. ఫీజుల వసూళ్లలో ప్రతాపం చూపిస్తున్నాయి. కాలేజీల కాసుల వేటలో విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడుతున్నారు. వేరే కాలేజీలో చేరతామని చెప్పినా వినిపించుకునేందుకు ససేమిరా అంటున్నాయి. ఒకవేళ మారాలనుకుంటే ఒక్క రోజు కాలేజీకి వెళ్లినా మొత్తం ఫీజులు చెల్లించాలని విద్యార్థులను వేధిస్తున్నాయి.
ఈ సమస్య కేవలం మేడ్చల్, కుత్బుల్లాపూర్ ప్రాతాలకు చెందిన విద్యార్థులదే కాదు.. ఇంటర్ చదివే విద్యార్థులందరూ ఎదుర్కొంటున్నారు. మేడ్చల్- మల్కాగిజిరి జిల్లాలో దాదాపు 250 వరకు ప్రయివేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. విద్యార్థులపై యాజమాన్యాలు ఫీజుల పడగ విప్పుతున్నాయి. ఒక్క రోజు నుంచి పది రోజుల వరకు తరగతులకు హాజరయ్యాక ఏదైనా కారణంతో మరో కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. మొత్తం ఫీజు చెల్లిస్తేనే టిసి, మెమో ఇస్తామని మెలిక పెడుతున్నారు. దీంతో ఇక్కడ మొత్తం ఫీజు చెల్లించి.. మరో కాలేజీలో జాయిన్ అయితే అక్కడా మొత్తం ఫీజు చెల్లించేందుకు తల్లిదండ్రులు నానాకష్టాలు పడుతున్నారు. చదువుపట్ల పిల్లలపై చూపుతున్న ప్రేమను ఈ రకంగా పలు కాలేజీలు ఉపయోగించుకుంటున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రయివేటు కాలేజీల ఫీజు దోపిడీపై విద్యార్థి సంఘాలు అనేక ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు అవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
దోపిడీ ఇలా..?
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కార్పొరేట్ కాలేజీల్లో ఏడాది ఫీజు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంది. ఇక సాధారణ జూనియర్ కాలేజీలోని సిఇసి, హెచ్‌ఇసి కోర్సులకు ఏడాది ఫీజు దాదాపు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంది. ఎంపిసి, బైపిసి కోర్సులకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. మొదట కాలేజీలో చేరేందుకు విద్యార్థి నుంచి అడ్మిషన్ ఫీజు రూపంలో రూ.2-5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత మొత్తం ఫీజులో రూ.10-20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒకటి నుంచి పది రోజుల వరకు ఆ కాలేజీలో క్లాసులకు హాజరైన తర్వాత ఆ కాలేజీ నచ్చకనో, మరే ఇతర కారణాలతోనో వేరే కాలేజీలో చేరాలనుకుంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. మిగిలిన ఫీజు చెల్లిస్తేనే టీసీ, మెమో ఇస్తామంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలా మధ్యలో వెళ్లిపోతే తమకు ఒక సీట్ లాస్ అవుతుందని, అందుకే ఫీజు మొత్తం చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. విద్యార్థికి ఏదైనా కాలేజీ నచ్చకపోతే వేరే కాలేజీలో చేరాలనుకుంటే మొత్తం ఫీజులు వసూలు చేయొద్దనే ప్రభుత్వ నిబంధన ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీన మేషాలు లెక్కిస్తుండటంతో జూనియర్ కాలేజీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జూనియర్ కాలేజీలపై నిఘా పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి : రాథోడ్ సంతోష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
జూనియర్ కాలేజీల దోపిడీపై జిల్లా ఇంటర్ విద్యాధికారులు స్పందించాలి. ఆ కాలేజీల గురించి తల్లిదండ్రులకు తెలియక పిల్లలను జాయిన్ చేస్తున్నారు. కొన్ని రోజులు తరగతులకు హాజరయ్యాక అక్కడ నచ్చకుంటే మరో కాలేజీకి మారాలంటే మొత్తం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, ప్రయివేట్ కాలేజీల్లో ప్రభుత్వ రూల్స్‌కు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. వెంటనే ఆయా కాలేజీలు టిసి, మెమోలు ఇచ్చేలా అధికారులు ఉత్తర్వులు జారీ చేయాలి. జూనియర్ కాలేజీ యాజమాన్యాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి.