బెంగళూరు : ప్రముఖ ఐటి సంస్థ విప్రో తమ ఫ్రెషర్స్‌కు తొలుత ఆఫర్ చేసిన జీతంలో సగానికి పని చేయాలని కోరడంపై ఆ వర్గాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. విప్రో చర్య చాలా అనైతికమని ఐటి సెక్టార్ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్‌ఐటిఇఎస్ విమర్శించింది. విప్రో నిర్ణయం అన్యాయమని, ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. విప్రో తన నిర్ణయంపై మరోసారి పునరాలోచించాలని కోరింది. విప్రో నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోన్నామని ఎన్‌ఐటిఇఎస్ అధ్యక్షుడు హర్పీత్ సింగ్ సలౌజా పేర్కొన్నారు. తమ సభ్యులకు నష్టం వాటిల్లితే ఊరుకోబోమన్నారు. ఇటీవల విప్రో తన ఫ్రెషర్లకు వేతన ప్యాకేజీని రూ.6.50 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించుకుని విధుల్లో చేరాల్సిందిగా కోరినట్లు రిపోర్టులు వచ్చాయి.










