
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్వహించిన వేడుకలు నిరుద్యోగ యువతను అపహాస్యం చేసినట్లయింది. అవమానపర్చినట్లయింది. ఉన్నత చదువులు పూర్తిచేసుకున్న యువత ఉపాధి కోసం వెతుకులాడుకోవాల్సిన దుస్థితి రావడం సిగ్గుచేటు. నిరుద్యోగం పెరిగి, పెరిగి, మోడీ పాలనలో ఇది మరింత తారాస్థాయికి చేరుకుంది. మోడీ సర్కారు కార్పొరేట్ అనుకూల విధానాలు దేశంలోని చిన్న పరిశ్రమల మూతకు దారితీశాయి. ఇందులో పని చేసిన కార్మికులు ఉపాధి కోల్పోయారు. దేశంలోని ఉద్యోగ, ఉపాధి, కార్మికులు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను జాతీయ, అంతర్జాతీయ నివేదికలు ఇప్పటికే హెచ్చరించాయి. నిరుద్యోగం, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మోడీ సర్కారు తగిన శ్రద్ధ చూపడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీరుతో దేశంలో లక్షలాది మంది కార్మికుల పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి. ధనిక, పేదల మధ్య అసమానతలు పెరిగాయి. రోజువారి కూలిపై ఆధారపడి జీవించే కార్మిక కుటుంబాలు దేశంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
దేశంలో సాధారణ వేతనాలతో కూడిన ఉద్యోగాలు 20 శాతం మాత్రమే వున్నాయి. దాదాపు 40 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో నిరుద్యోగ రేటు ఇటీవల నెలల్లో ఏడు నుండి ఎనిమిది శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియా ఎకానమీ (సిఎంఐఈ) తెలిపింది. దేశంలో 2022 జులై 25 నాటికి 6.56 శాతమున్న నిరుద్యోగ రేటు ఆగస్టు 10 నాటికి 7.7 శాతానికి పెరిగింది. ఇది పట్టణాల్లో జులై నాటికి 8.03 నుంచి ఆగస్టు నాటికి 9.4 శాతానికి, గ్రామీణ ప్రాంతంలో 5.9 నుండి 7 శాతానికి పెరిగింది. హర్యానాలో అత్యధికంగా నిరుద్యోగ రేటు 26.9 శాతం నమోదైంది. 2016 నుండి నేటివరకు వివిధ రాష్ట్రాల్లోని సిఎంఐఈ లెక్కలను పరిశీలిస్తే హర్యానాలో నిరుద్యోగ రేటు 2016 జనవరిలో 14.8 శాతం వుంటే 2022 జులై నాటికి 26.9 శాతానికి పెరిగింది. బీహార్‌లో 4.4 శాతం నుండి 18.8 శాతానికి, జమ్ము కాశ్మీర్‌లో 12.3 శాతం నుండి 20.2 శాతానికి, త్రిపురలో 8.5 శాతం నుండి 13 శాతానికి పెరిగింది. ఈ నిరుద్యోగం బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే అత్యధికంగా వుంది. ఈ ఏడాది జులై, ఆగస్టు మధ్య నిరుద్యోగ శాతం ఆందోళనకరంగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో నిరుద్యోగ శాతంలో పెరుగుదల కనిపించింది. ఈ తరహా పరిణామాలు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేవని, తక్షణమే నివారణ చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నప్పటికీ మోడీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయడంలేదు. ధరల పెరుగుదల కూడా నిరుద్యోగం పెరగడానికి కారణమని నివేదిల్లో నివేదికల్లో హెచ్చరిస్తున్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో మార్కెట్‌లో రొటేషన్ పద్ధతి, కొనుగోళ్లు భారీగా తగ్గుతున్నాయి. నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగాలను సృష్టించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రత తక్కువేమీ లేదు. ప్రతి యేటా మొదటి నెల జనవరిలో ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట నిలబెట్టుకోలేదు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లోని దాదాపు 2.34 లక్షల ఖాళీలు భర్తీ చేయడంలేదు. నిరుద్యోగుల ఆందోళనతో లక్ష 80 వేల పోస్టులకు నోటిఫికేషన్లున జారీ చేస్తామన్నారు. కొద్ది రోజులకు 65 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేయగలమన్నారు. వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను మోసగిస్తున్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని జిఓ విడుదల చేసింది. ఈ జిఓ ఏ పరిశ్రమలోనూ అమలు కావడంలేదు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదు. ఏటా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, నూతన విద్యా విధానం అమలు చేసి క్లాసుల విలీనంతో మిగుల ఉపాధ్యాయులను తేల్చుతున్నది. మెగా డిఎస్‌సి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఊరిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరం ''పండగకి కొత్త అల్లుడు'' చందంగా సచివాలయాల ఉద్యోగాలు తీసి మిగిలిన ప్రభుత్వ శాఖలు, ఉపాధ్యాయ, అధ్యాపక ఖాళీల భర్తీపై మౌనం దాల్చుతున్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మాట్లాడ్డంలేదు.
యువత అసంతృప్తులను అర్ధంచేసుకొని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలి. వారి అసంతృప్తి అధికార పీఠాలు కూల్చే స్థాయికి చేరకముందే నేతలు మేలుకోవాలి.
- అల్లు రాజు