Aug 14,2023 07:40

'ఒంటి మీద గుడ్డలతో
జెండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న ధైర్యంనీది' అన్న
దిగంబర కవి వాక్యాన్నే
ఇపుడీ మణిపురి నేల మీద
వివస్త్రలై ఊరేగించిన ఆ తల్లుల ఒంటిమీద
నిండుగా కప్పుతున్నాను.

క్షమించండి ..!
నేను ఇప్పుడు అస్త్ర సన్యాసిని ...
వాక్యం గుండె లోతుల్లో కొట్టుకుని సుళ్ళు తిరిగి
ఊపిరాడక బయటకు రావటంలేదు ...
లేదంటే ...
ఈ అమానవీయ అఘోర తనాల చీకటి తెరల్ని
సూదంటి కత్తి మొనతో చీల్చి చెండాడేవాడ్ని
నా నిరాయుధతనంతో నేనిలా కూలబడిపోయాను

దేశమా వర్థిల్లు ...
వొళ్ళంతా కళ్ళు చేసుకుని టీవీ తెరల మీద
టచ్‌స్క్రీన్‌ మీద పదే పదే మార్చి చూస్తూ మూర్ఛరోగివై పో...

వర్ధమాన సినీ హీరోకు పూలజల్లుల వాన కురిపించినట్టు
వాళ్ళనలా గుడ్డల్లేనితనంతో వీధుల్లో ఊరేగించారేగాని
ఒక్కడూ ఆకాశపు తాను గుడ్దను చింపి
వాళ్ళ ఒంటి మీద కప్పలేని
మీ వదరబోతుతనానికి
వర్తమానం సిగ్గుతో చచ్చిపోయింది!

అవును కదా !
దేహి అని వచ్చి
అన్నం పెట్టమన్న నోటితోనే వివస్త్రగా వడ్డించమన్న
గొప్ప పురాణ పురుషుల వారసులు కదా మీరు!
వావివరసలు మీకెందుకుంటాయి
అమ్మంటే పాలిచ్చే జంతువు కాదని
అస్థి రక్త మాంసాల ప్రయోగశాలని
మీకు ఏలా చెప్పాల్రా?
ఆవును దేవతను చేసి
అమ్మను వివస్త్రను చేసే
మను సంస్క ృతిని మీ రక్త నాళాల్లో నింపుకుని
తల్లి భారతీ వందనమని వల్లె వేసే
మీ నంగనాచి పాచి పాటల్లో
ఎంత బూతును దాచుకున్నార్రా?
ఇక .....
మీ మదమెక్కిన శరీరాల్ని
జరాసంధుడి శరీరాన్ని
రెండుగా చీల్చినట్టు చీల్చి
నేలకొరిగి పోతున్న మానవీయ విలువలకు
బోటుగా నిలబెడతాను

అమ్మా! మణిపురీ మహిళల్లారా!
మీరు మరో యుద్ధానికి సన్నద్ధం కావాలి
పుట్ట తేనెలాంటి మీ జీవితాలను దోచుకునే
స్వదేశీ సామ్రాజ్యవాద విష కీటకమూకను
మీ నగ పాదాలతో నిర్దాక్షిణ్యంగా తొక్కి పాతరేయాలి!
 

- డా.కుంచే నాగ సత్యనారాయణ
91107 20774