Nov 04,2023 13:30

అమరావతి : సిఎం జగన్‌ అసమర్థ పాలనలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. తాజాగా... నాగార్జున సాగర్‌ సమీపంలోని విజయపురి సౌత్‌ కమ్యూనిటీ ఆస్పత్రి ప్రాంగణంలో చెట్ల కింద రోగుల దుస్థితిపై లోకేశ్‌ స్పందించారు. నాలుగున్నరేళ్ల పాలన ప్రజలకు శాపంలా మారిందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి జగన్‌ చేతగాని పాలనకు అద్దం పడుతోందన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన తండాల ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న ఈ ధర్మాస్పత్రిలో మూడేళ్లుగా చెట్ల కిందే వైద్య సేవలు అందిస్తున్నారంటే సిఎం సిగ్గుతో తలదించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే.. అల్లూరి జిల్లా లాంటి మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇక ఆ దేవుడేదిక్కన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఆక్సిజన్‌ సరఫరా వైఫల్యం కారణంగా కళ్లెదుటే.. వేలాదిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూశామని గుర్తు చేశారు. జగన్‌ దివాలా కోరు పాలన పుణ్యమా అని కర్నూలు, అనంతపురం వంటి బోధనాస్పత్రుల్లోనే దూది సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు కళ్లెదుట కన్పిస్తుంటే.. తమ హయాంలో వైద్య, ఆరోగ్య రంగం వెలిగిపోతుందని, జగనన్న సురక్ష పేరుతో ఇళ్లవద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రిని పిచ్చోడుగాక మరేమనాలని లోకేశ్‌ దుయ్యబట్టారు.