- తక్షణమే విడుదల చేయాలి
- ముఖ్యమంత్రికి లోకేష్ లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిగ్రీ, పిజి విద్యార్థులకు ఫీజు బకాయిలు రూ.1,650 కోట్లు తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం ఆయన లేఖ రాశారు. 2021-22 బకాయిలు రూ.600 కోట్లు, 2022-23లో నాలుగో టర్మ్ ఫీజు రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు. నాలుగేళ్లుగా పిజి కోర్సుల బకాయిలు రూ.450 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. విద్యాసంవత్సరం మొదలై నాలుగు నెలలు గడుస్తున్నా ఫీజు బకాయిలు చెల్లించలేదని అన్నారు. కళాశాలల యాజమాన్యాలు పరీక్షలు రాయనీయడం లేదని, విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. చదువు పూర్తయిన వారి మార్కుల లిస్టులు, ఇతర సర్టిఫికెట్లు జారీని నిలిపేశాయని అన్నారు. పై చదువులు, ఉద్యోగ పరీక్షలు, ఇంటర్వ్యూలకు హాజరయ్యే విద్యార్థులు సర్టిఫికెట్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్రం ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు ఇస్తున్న 60 శాతం ఫీజు ఏ లెక్కలోనూ చూపడం లేదని విమర్శించారు. విద్యాదీవెన డబ్బులను విద్యార్థి, తల్లి జాయింట్ ఖాతాలో వేస్తామంటూ మెలిక పెట్టడం విద్యార్థుల్ని మరింత ఇబ్బందులకు గురిచేసే ప్రహసనమని పేర్కొన్నారు.