చెన్నై: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఎంఎ చిదంబరం స్టేడియంలో శుక్రవారం బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 245పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు 42.5ఓవర్లలో కేవలం 2వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్ రౌండ్ షో కనబర్చింది. కివీస్ జట్టులోకి పునరాగమనం చేసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ 78 పరుగులు చేశాడు. విలియమ్సన్ స్కోరులో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఆ తర్వాత ఎడమ చేయి బొటనవేలికి గాయం కావడంతో విలియమ్సన్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. మరో ఎండ్ లో డారిల్ మిచెల్ 67 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గ్లెన్ ఫిలిప్స్(16నాటౌట్) మ్యాచ్ ముగించాడు. ఓపెనర్ డెవాన్ కాన్వే (45) రచిన్ రవీంద్ర (9) నిరాశపరిచాడు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌కు ఇది రెండో పరాజయం.










