శ్రీశ్రీ అనే పేరుతో ప్రసిద్ధుడైన రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు. అలాగే 'రా.రా' అనేక రెండక్షరాల పేరుతో ప్రసిద్ధమైన రచయిత రాచమల్లు రామచంద్రారెడ్డి. ఈ ఇద్దరి మధ్య ఈ సామ్యంగా ఉండడం ఒక వాస్తవం కాగా, శ్రీశ్రీ రారానూ క్రూరుడైన విమర్శకుడని నిర్వచించడం మరో వాస్తవం. ఈ ఇద్దరూ మార్క్సిస్టు సాహిత్యం తానులో పోగులే! రారా మార్క్సిస్టు మేధావి, అభ్యుదయ రచయిత. తెలుగు అభ్యుదయ రచయితల్లో రారా రెండోతరం రచయిత. కుందుర్తి, ఆరుద్ర, అవంత్స, గజ్జెల మల్లారెడ్డి వంటి వారి తరానికి చెందిన రచయిత. రారా ప్రధానంగా సాహిత్య విమర్శకుడు, ఆ తర్వాత అనువాదకుడు. అనువాద తత్వవేత్త, కథకుడు, బాల సాహిత్య రచయిత, పాత్రికేయుడు.
1922 సెప్టెంబర్ 28న కడప జిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాళెంలో ఒక వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. లక్ష్మమ్మ, బయపరెడ్డి వారి అమ్మానాన్నలు. 1931-37 మధ్య పులివెందులలో పాఠశాల విద్యా, 1937-39 మధ్య అనంతపురంలో ఇంటర్ చదివారు. ఆ తర్వాత చెన్నైలోని ఇంజనీరింగ్ కళాశాలలో చేరి, స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, కళాశాల నుంచి బహిష్కరణకు గురయ్యారు. క్షమాపణ చెప్పి ఉంటే చదువు కొనసాగేది. రాజీపడలేదు గనుక చండ్ర పుల్లారెడ్డితో పాటు రారా కూడా చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చింది. రారా సవ్యసాచి (1959 -63), సంవేదన (1968-69) వంటి అనే సాహిత్య పత్రికలకు సంపాదకత్వం వహించారు. ప్రజా సాహిత్య వికాసానికి దోహదం చేశారు. విశాలాంద్ర దినపత్రికలో ఆరు నెలలు (1964 జనవరి - జూన్) ఉప సంపాదకులుగా పని చేశారు. ఈనాడులో రెండేళ్ళు (1977 ఏప్రిల్-1979 మార్చి) పనిచేశారు. మాస్కోలో ఆరేళ్లు ప్రగతి ప్రచురణాలయంలో (1969-75) అనువాదకుడిగా పనిచేశారు. 1959-85 మధ్య దాదాపు మూడు దశాబ్దాలు ఆయన రచనా జీవితం గడిచింది. 1957 - 59 మధ్య ఆయన కొన్ని కథలు రాశారు. అవి 1960లో అలసిన గుండెలు పేరుతో వచ్చాయి. 1959 - 85 మధ్య విభిన్న పత్రికల్లో ఆయన రాసిన సాహిత్య వ్యాసాలు 'సారస్వత వివేచన' (1976), 'వ్యక్తి స్వాతంత్య్రం సామాజిక శ్రేయస్సు' అనే గ్రంధాలుగా వచ్చాయి. స్వయంగా అనువాద అనుభవం ఉండటం వల్ల, అనువాదం గురించి నిర్ధిష్టమైన అభిప్రాయాలు ఉండటం వల్ల ... రారా అనేక రకాల తెలుగు అనువాదకుల రాతలను అధ్యయనం చేసి 'అనువాద సమస్యలు' అనే పేరుతో ప్రచురించారు. ఈ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఇంకా కొన్ని సాహిత్య లేఖలు, బాలల రచనలు చేశారు.
1829 నుంచి క్రమంగా వికసిస్తూ వస్తున్న ఆధునిక తెలుగు సాహిత్య విమర్శలకు కట్టమంచి 'కవిత్వతత్వ విచారం'తో ఒక పరిణామరూపం ఇచ్చినట్లే.. 1930లలో మొదలై క్రమ వికాసం పొందుతున్న మార్క్సిస్టు సాహిత్య విమర్శకు రారా తన వ్యాసాలతో పరిణతరూపం కల్పించారు. రారా కన్నా ముందు రాచకొండ నరసింహారెడ్డి, శ్రీశ్రీ, కొ.కు, మద్దుకూరి వంటి అనేకులు మార్క్సిస్టు సాహిత్య విమర్శకు వేసిన పునాదిని రారా పటిష్టం చేసి పరిపుష్టం చేశారు. మార్క్సిస్టు విమర్శకులు ఎక్కువగా సాహిత్యంలో వస్తువునే అన్వేషిస్తున్న సమయంలో రారా వస్తు పరామర్శతో పాటు సాహిత్య రూపాన్ని కూడా గౌరవిస్తూ చర్చించారు. సాహిత్య శిల్పం గురించి గట్టి ఆలోచనలు చేశారు. సాహిత్యానికి సంబంధించి రారా అందించిన సూత్రాలు చాలా విలువైనవి. అభ్యుదయ రచయితలకు వర్గదృక్పథం, మార్క్సిస్టుతత్వ దృక్పథం తప్పకుండా ఉండాలని ఆయనన్నారు. అభ్యుదయ కవిత్వం ఆనందం కన్నా ఉత్తేజం ఇవ్వాలన్నారు. జీవితంలో లాగే సాహిత్యంలోనూ రాజకీయాలు ఉంటాయని, అయితే రాజకీయాలే సాహిత్యం కాదని గట్టిగా చెప్పారు. ఏ రకం రచయితలకైనా నిబద్ధత అనివార్యంగా ఉంటుందని కూడా రారా చెప్పారు. సాహిత్యానికి ప్రచార గుణం ఉన్నా కేవలం ప్రచారమే సాహిత్యం కాదన్నారు రారా. రచనలో వస్తువు, శిల్పంతో పాటు కళ కూడా ప్రధానంగా ఉంటుందని రారా అభిప్రాయపడ్డారు. వస్తు శిల్పాలు రెండూ సమన్వయం పొందాలని ఆయన పేర్కొన్నారు. ''సాహిత్యంలో వస్తువు, శిల్పం అని రెండు అంకాలున్నాయి. ఒక రచనలో వస్తువు యెంత అమూల్యమైనదైనా, శిల్పం లేకుంటే దాన్ని సాహిత్యం అనం. అట్లే ఒక రచనలో శిల్పం యెంత అమోఘంగా వున్నా వస్తువు హీనమైనదో, నిరాదరణీయమైనదో అయితే దాన్ని కూడా సాహిత్యం అనం. పరిపుష్టమైన శిల్పమూ, విలువ గల వస్తువు యీ రెండూ వున్నప్పుడే ఒక రచన ఉత్తమ సాహిత్యమౌతుంది'' అని మన ఆయన ఒక గొప్ప మార్క్సిస్టు సాహిత్య సూత్రం చెప్పారు. వస్తు శిల్పాలు కళగా పరిణతి చెందినప్పుడే రచన పాఠకుని హృదయాన్ని తాకుతుందని ఆయన సిద్ధాంతం చేశారు.
తెలుగు రచయితలను పరామర్శిస్తూ, రారా ... నిర్మొహమాటంగా మాట్లాడారు. ఒక రచయితను ఎంతవరకు ఆమోదించాలో, ఎంతవరకు తిరస్కరించాలో రారా చేసి చూపించారు. ఎంతో నిగ్రహంగా మాట్లాడే రారా రచయితల్లోని అపసవ్య ధోరణులను ఎత్తి చూపేటప్పుడు కొంత కటువుగా మాట్లాడారు. ఒక రచయితకు గానీ, ఒక రచన గానీ తూకం వేసినట్లు, శాస్త్రీయంగా అంచనా కట్టడమెలాగో రుజువు చేశారు. 'మహానుభావుడు చలం' అనే వ్యాసంలో చలం గురించి గొప్ప గౌరవాన్ని ప్రకటించారు. 'చలమే లేకపోతే' అంటూ వరుసగా పరివాక్యాలు రాసి... చలం వల్ల తెలుగు సాహిత్యానికి ఒనగూర్చిన మేలును కీర్తించారు. ఇదే సమయంలో 'పురూరవ' నాటకంలోని శిల్పం నచ్చక సిద్ధాంతపరంగా పురూరవ గొప్పది కావొచ్చుగానీ, సాహిత్య పరంగా అది 'నికృష్ట'మైన రచన అని అభిప్రాయపడ్డారు. ఆర్‌ఎస్ సుదర్శనం గారిని గొప్ప మేధావిగా గుర్తిస్తూనే, అతనిది 'మేర మీరిన మేధ' అని నిర్వచించారు. 'అన్నీ మన వేదాల్లో ఉన్నాయని అనేవాళ్ళు మనదేశంలో యింకా వున్నారని తెలుసు గానీ, సుదర్శనం గారి వంటి మేధావి వాళ్ళ గురుపీఠానికి విశ్వనాధ సత్యనారాయణతో పోటీ పడడం ఈ దేశ దౌర్భాగ్యం' అనడానికి రారా వెనుకాడలేదు. రారా దిగంబర కవిత్వాన్ని, విప్లవ సాహిత్యాన్ని ఆమోదించలేదు. దిగంబర కవుల మీద ఘాటైన విమర్శ పెట్టారు. 'సమాజం కుళ్ళిపోయిన మాట నిజమే కానీ, సమాజం పతనమైన మాట వాస్తవమే కానీ, యెంత పతనమైనా యీ దిగంబరుల పైత్యాన్ని కవిత్వంగా అంగీకరించేంతగా పతనమయిందా?' అని ప్రశ్నించారు. అంతేకాదు, దిగంబర కవులను లిటరరీ లంపెన్ ప్రోలిటేరియట్ అనటానికి సంకోచించలేదు. నచ్చని దానిని అంత కఠినంగా వ్యాఖ్యానించిన రారా, నచ్చినదానిని 'యీ యుగానికి పథనిర్దేశకులు ఈ యిద్దరూనూ' (శ్రీశ్రీ, కొ.కు) అన్నారు. కెవి రమణారెడ్డి 'మహోదయం' గ్రంథం గురజాడకు సంబంధించిన విజ్ఞాన సర్వస్వం' అని నిర్వచిస్తూనే- 'ఆయన శైలీ ఒక విధంగా ఆయన కృషికి అన్యాయం చేస్తుంది' అన్నారు. గురజాడ తన కాలం నాటి మిగతా రచయితల కన్నా చాలా ముందు చూపున్న రచయిత అని గుర్తిస్తునే, గిరీశం పాత్రను సృష్టించడం మాత్రం, గురజాడ మనస్తత్వంలోని విపరీత ధోరణి' అన్నారు.
మహీధర రామమోహనరావు గారి కొల్లాయి గట్టితేనేమి? నవలను గొప్ప చారిత్రక నవలగా నిర్వచిస్తూ విశ్లేషించారు. వాచక విమర్శను ఎంత లోతుగా చేయవచ్చునో రుజువు చేశారు. చారిత్రక నవలను నాలుగు ప్రమాణాలను పేర్కొని, అన్వయించిన తీరు అమోఘం. చారిత్రకత, దేశ కాల నిర్ధిష్టత, పాత్రల మధ్య సంఘర్షణ, చరిత్ర పాఠకుడిలో అది తన చరిత్రేనని అనుభూతం కావడం వంటి కొత్త లక్షణాలను చెప్పి, నవలను పరామర్శించారు ఈ వ్యాసం నవలను సమాజంలోకి తీసుకొచ్చింది. తిలక్‌ను వస్తుత: భావకవి అని రారా నిర్వచించారు.అభ్యుదయ సాహిత్యంలో స్తబ్ధత ఏర్పడిందనుకునే సమయంలో రారా అభ్యుదయ సాహిత్యాన్ని సరికొత్తగా వ్యాఖ్యానించారు. 'విరసం పుట్టుకే అనారోగ్యకర వాతావరణంలో జరిగింది అని రారా ఆ సాహిత్యోద్యమాన్ని వ్యతిరేకించాడు. నార్ల వెంకటేశ్వరావు కథానికకు చెప్పిన లక్షణాలను రారా సవరించా రు. రారా సాహిత్య విమర్శతో కాలం చెల్లిన భావాలను తిరస్కరించడం, ఆధునిక భావాలను సవరించడం, శాస్త్రీయమైన భావాలను ప్రతిపాదించడం అనే మూడు లక్షణాలు కనిపిస్తాయి.
రారా గొప్ప కథాశిల్ప విజ్ఞాని. చాలామంది కథకులకు ముందు మాటలు రాశారు. కథలు రాశారు. కథలు ఎలా రాయాలో నేర్పించటానికన్నట్టు ఆయన కథలు రాశారు. 1950 తర్వాత తెలుగు కథల్లో వదులుతనం ప్రవేశించి వస్తుబలం, శిల్పశక్తి బలహీనపడుతున్న సమయంలో రారా కథలు రాశారు. పాఠకుల సంస్కారంలో మార్పు తేవడమే కథా ప్రయోజనమని రారా అభిప్రాయం. ఈ దృష్టితోనే ఆయన కథలు రాశారు. అభ్యుదయ రచయితగా రారా ... ఆర్థిక పరిస్థితులు మానవ జీవితం మీద కలిగించే ప్రభావాన్ని చాలా కథల్లో చిత్రించారు. మన ఆర్థిక వ్యవస్థ మానవులకు అనుకూలమైంది కాదు. అది మానవతా శత్రువు, మానవతా ద్వేషి.' అని తన దేశంలోని దేవతా కన్యలు అనే కథలో సిద్థాంతం చేశారు. అలసిన గుండెలు కథలో ఒక మధ్య తరగతి తల్లి, చిన్నప్పుడు చనిపోయిన ఇద్దరు పిల్లల్ని తలచుకుని, 'వాళ్ళు బతికుంటే ఎంతకష్టంగా ఉండేది' అనుకుంటుంది. ఆర్థికంగా అలసిపోయిన తల్లి మనస్తత్వానికి ఈ కథ అక్షరచిత్రం. డబ్బు ముందు అన్ని నైతిక విలువలూ ఎలా మసకబారిపోతాయో రారా 'నీతిగానుగ' కథలో ఆవిష్కరించారు. ఎవరినో ప్రేమించిన అమ్మాయి తనకు వద్దంటూ మొరాయించిన పెళ్ళి కొడుకు, రెండు వేలు అధికంగా కట్నం ఇస్తామంటే, ఆమెను పెళ్ళాడడానికి తయారవుతాడు ఈ కథలో. 'ఏదో ఒకటి అమ్ముకోకుండా బతికే పద్ధతి మనదేశంలో ఇంకా ఎవరూ కనిపెట్టలేదు' అన్న సూత్రంతో రారా 'ఆత్మహత్య' కథ రాశారు. సమాజంలోని మనుషులు, దేహాలనో, ఆత్మలనో, దేనినో ఒకదానిని అమ్ముకునే బతుకుతున్నారని ఈ కథ ధ్వనిస్తుంది. కుహనా సంస్కర్తల స్వభావం ఎలా ఉంటుందో 'ఓడిపోయిన సంస్కారం' కథలో వితంతువును పెళ్ళాడిన మగవాడి పాత్ర ద్వారా ప్రదర్శించారు. రారా 'అనువాద సమస్యలు' లోతైన పరిశోధన, విలువలు గల గ్రంథం. అనువాదంలో తెలుగువాళ్ళు చేస్తున్న తప్పులను నిర్దాక్షిణ్యంగా ఎత్తి చూపారు రారా ఈ గ్రంథంలో. 'టైం' అనే మాటను తెలుగులో ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాయో ఒక వ్యాసంలో ఆసక్తికరంగా చర్చించారు. అనువాద సమస్యల్ని చర్చించే క్రమంలో అనువాద సూత్రాలను కూడా రూపొందించారు. అనువాదం మూలరచనలోని భావాన్ని సంపూర్ణంగా వ్యక్తం చేయాలి. శైలి, రచనావిధానం మూల రచనలో ఉన్నట్లే అనువాదంలోనూ ఉండాలి. మూలరచన పాఠకునితో ఎంత హాయిగా చదివిస్తుందో, అనువాదం కూడా అంత హాయిగా చదివించాలి. ఇలాంటివి ఆయన రూపొందిన సూత్రాలు. అనువాదకులు కొత్త పదాలను సృష్టించడం అవసరమంటారు. ఒక భాషా గ్రంథం నచ్చడం వల్లనే ఎవరైనా అనువాదానికి పూనుకుంటూరంటారు రారా. మంచి అనువాదమంటే రారా ఇలా చెప్పారు : 'మూలభాష మాతృభాషగా గలవానికి మూల రచనలోని సారాంశం యెంత స్పష్టంగా అర్థమై, యెంత గాఢమైన అనుభూతిని కలిగిస్తుందో, లక్ష్య భాష మాతృభాషగా గల వానికి అనువాదంలోని సారాంశం అంత స్పష్టంగాను అర్థమై అంతగాఢమైన అనుభూతిని కలిగిస్తే, అది మంచి అనువాదం'' రష్యన్ సాహిత్య అనువాదకుడుగా, ఆ భాషానువాదంలో సమస్యలను రారా బాగా వివరించారు.
తెలుగు సాహిత్యంలో కదలిక మందగించింది. తెలుగు సాహిత్యంలో వ్యాపార ధోరణి ప్రకాశించింది అనుకుంటున్న సమయంలో అభ్యుదయ చింతనాపరుడిగా తెలుగు సాహిత్య పురుజ్జీవనానికి బిగించిన రచయిత, విమర్శకుడు రారా. సాహిత్య విమర్శ ఎలా ఉండాలి? విమర్శ భాష ఎలా ఉండాలి? సాహిత్య విమర్శకులు ఎలా ఉండాలి? సాహిత్యతత్వం ఏమిటి? సాహిత్య ప్రయోజనం ఏమిటి? రచయితల కుండవలసిన లక్షణాలు, బాధ్యతలు ఏవి? సాహిత్యంలో ఆమోద, అంశాలెలా ఉంటాయి? మొదలైన ప్రశ్నలకు రారాను చదవి సమాధానాలు తెలుసుకో వచ్చు. సాహిత్య విమర్శ ద్వారా సాహిత్య రచనలో జరిగే లోపాలను ఎలా సవరించవచ్చో రారా నేర్పారు. ఆయన ఒక గొప్ప ఉపాధ్యాయుడు.
(ఇది రా.రా. శత జయంతి సంవత్సరం)
- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి










