Jul 10,2023 07:25

వాడికది రోజువారీ
అలవాటులా ఉచ్చ పోస్తున్నాడు
ఈ దేశ మూలవాసీ ముఖంపై

తనకెవడేం చేయలేడని తన మొల చుట్టూ వున్న
జంధ్యం వాడికా ధైర్యాన్నిస్తోంది
కులమనే అహంకారం వాడికా
స్వేచ్ఛనిస్తోంది
దేవుడి ముఖంలోంచి
పుట్టుకొచ్చాననే గర్వం వాడి
శిశ్నం చుట్టూ ఉక్కు కవచమయింది

పొగరు బోతుతనానికి
ఏలిన వారి ఏభై ఆరు అంగుళాల ఛాతీ
రక్షణ కవచమయింది

నెత్తిన ఎగిరే కాషాయ జెండా
ఈ దేశం వాడొక్కడి జాగీరుగా
వాడి కళ్ళలో విషపు నాగులా
బుసలు కొట్టిస్తోంది !

చట్టమెప్పుడూ తన చుట్టమనే
నమ్మకాన్ని వమ్ము చేయని
ప్రభుత ఆడే డ్రామాలో
మునిగిపోయింది మేధావితనం

ఇంక వాడి ఉచ్చే
ఈ దేశ శిఖరాగ్రం నుంచి
నీపై, నాపై పడే పవిత్ర జలం
రండి దోసిళ్ళతో
తాగి పెడదాం ...!
 

- కెక్యూబ్‌ వర్మ