Jul 26,2023 09:44

వాషింగ్టన్‌ : ఆదివారం జరిగిన కంబోడియాఎన్నికల్లో ప్రధానమంత్రి హున్‌ సేన్‌కు చెందిన కంబోడియన్‌ పీపుల్స్‌ పార్టీ (సిపిపి) విజయం సాధించిన వెంటనే అమెరికా ఆ దేశంపై ఆంక్షలు విధించింది. ఈ ఎన్నికలు న్యాయంగా, నిష్పక్షపాతంగా జరగలేదంటూ అది ఈ చర్యకు పూనుకుంది. ఇదిలా ఉండగా కంబోడియా పార్లమెంటులోని మొత్తం 125 స్థానాలకు గాను అధికార సిపిపి 120 స్థానాలు గెలుచుకుని అఖండ విజయం సాధించింది. జాతీయ ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష క్యాండిల్‌ లైట్‌ పార్టీ పోటీ చేయలేదు. గత 38 ఏళ్ల నుంచి అధికారంలో ఉంటున్న హున్‌సేన్‌ ఈసారి తన పెద్ద కుమారుడు, ప్రస్తుత సైన్యాధ్యక్షులు 45 ఏళ్ల హున్‌ మానెట్‌కు ప్రధాన మంత్రి బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే మరోవైపు కంబోడియా ఎన్నికలపై అమెరికా గుర్రుగా ఉంది. ఎన్నికలు సక్రమంగా జరగలేదని ఆరోపించింది. ఆంక్షలు ప్రకటించింది.కంబోడియాకు చెందిన కొంత మంది ఉన్నతాధికారులకు వీసా నిరాకరిస్తున్నట్టు తెలిపింది.