- రైబకినా ఔట్..
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి 6వ సీడ్, అమెరికాకు చెందిన కోకా గాఫ్, 15వ సీడ్ బెన్సిక్ ప్రవేశించారు. శనివారం జరిగిన మూడోరౌండ్ పోటీలో గాఫ్ 3-6, 6-3, 6-0తో 32వ సీడ్ మెర్టెన్స్(జర్మనీ)పై, స్విట్జర్లాండ్‌కు చెందిన బెన్సిక్ 7-6(7-1), 2-6, 6-3తో జూ(చైనా)పై పోరాడి నెగ్గారు. మరో పోటీలో మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణి వాజ్నియాకీ(డెన్మార్క్) 4-6, 6-3, 6-1తో బ్రాడీ(అమెరికా)పై గెలుపొందగా.. 4వ సీడ్ రైబకినా(కజకిస్తాన్) అనూహ్యంగా మూడోరౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. రైబకినా 3-6, 7-6(8-6), 4-6తో 30వ సీడ్ క్రిస్టెల్లా(జర్మనీ) చేతిలో పోరాడి ఓడింది. ఇక టాప్‌సీడ్ ఇగా స్వైటెక్, 10వ సీడ్ ముఛోవా(చెక్), 20వ సీడ్ ఓస్టాపెంకో(లాత్వియా) ప్రత్యర్థులపై గెలిచి ప్రి క్వార్టర్స్‌కు చేరారు. ప్రి క్వార్టర్స్‌లో 30వ సీడ్ క్రిస్టెలా, 15వ సీడ్ బెన్సిక్‌తో తలపడనుంది.
చెమటోడ్చిన జకోవిచ్..

పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరేట్ నొవాక్ జకోవిచ్ ఐదుసెట్ల హోరాహోరీ పోరులో చెమటోడ్చి నెగ్గాడు. శనివారం జరిగిన మూడోరౌండ్ పోటీలో జకోవిచ్ 4-6, 4-6, 6-1, 6-1, 6-3తో 32వ సీడ్ డారే(సెర్బియా)పై విజయం సాధించాడు. అలాగే 9వ సీడ్ ఫ్రిట్జ్(అమెరికా) 6-1, 6-2, 6-0తో జెన్సిక్(చెక్)పై, టామీ పాల్(అమెరికా) 6-1, 6-0, 3-6, 6-3తో 21వ సీడ్ డెవిడెవిక్(స్పెయిన్)పై విజయం సాధించి ప్రి క్వార్టర్స్‌కు చేరారు. ఆదివారం జరిగే ప్రి క్వార్టర్స్‌లో 2వ సీడ్ జకోవిచ్ క్రొయేషియాకు చెందిన గోజోతో, 10వ సీడ్ టఫీ అన్‌సీడెడ్ హిజికటా(ఆస్ట్రేలియా)తో తలపడనున్నారు.










