Aug 29,2023 19:44

న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో 2వ సీడ్‌, సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌ శుభారంభం చేశాడు. సోమవారం రాత్రి జరిగిన తొలిరౌండ్‌ పోటీలో జకోవిచ్‌ 6-0, 6-2, 6-3తో అలెగ్జాండర్‌ ముల్లర్‌(ఆస్ట్రేలియా)పై వరుససెట్లలో నెగ్గాడు. తొలి సెట్‌ను ఒక్క పాయింట్‌ కూడా కోల్పోకుండా కేవలం 23 నిమిషాల్లోనే చేజిక్కించుకున్నాడు. అలాగే యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో తొలిరౌండ్‌ పోటీలో నెగ్గి 17-0 ఆధిక్యతలో నిలిచాడు. అలాగే ఈ విజయంతో ఏటిపి ర్యాంకింగ్స్‌లో 390వ వారాలపాటు అగ్రస్థానంలో ఉన్న రికార్డును నెలకొల్పాడు. కెరీర్‌లో ఇప్పటివరకు 23గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన జకోవిచ్‌ మరో టైటిల్‌ను చేజిక్కించుకుంటే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన మార్గరేట్‌ను రికార్డును సమం చేయనున్నాడు. ఇతర పోటీల్లో 7వ సీడ్‌ సిట్సిపాస్‌(గ్రీక్‌) 6-2, 6-3, 6-4తో రోనిక్‌(కెనడా)పై, 9వ సీడ్‌ ఫ్రిట్జ్‌(అమెరికా) 6-2, 6-1, 6-2తో సహచర ఆటగాడు జాన్సన్‌పై నెగ్గి రెండోరౌండ్‌కు దూసుకెళ్లారు.

రెండోరౌండ్‌కు కోకా గాఫ్‌

ఇక మహిళల సింగిల్స్‌లో అమెరికా టీనేజర్‌ కోకా గాఫ్‌ చెమటోడ్చి రెండోరౌండ్‌కు చేరింది. తొలిరౌండ్‌లో 6వ సీడ్‌ గాఫ్‌ 3-6, 6-2, 6-4తో జర్మనీకి చెందిన సెజ్‌మౌండ్‌పై నెగ్గింది. ఇతర పోటీల్లో టాప్‌సీడ్‌ ఇగా స్వైటెక్‌(పోలండ్‌) 6-0, 6-1తో పెటెర్సన్‌(స్వీడన్‌)పై గెలుపొందగా.. 8వ సీడ్‌ సక్కారి(గ్రీక్‌), స్టెఫెన్స్‌(అమెరికా) తొలిరౌండ్‌ పోటీల్లోనూ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. మరో పోటీలో 4వ సీడ్‌ రైబకినా(కజకిస్తాన్‌) 6-2, 6-1తో కోస్ట్యుక్‌(ఉక్రెయిన్‌)పై గెలిచి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లారు.