- సింగిల్స్‌లో జకోవిచ్, షెల్టన్ కూడా..
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో భారత సీనియర్ ఆటగాడు రోహన్ బొప్పన్న సెమీస్‌కు చేరాడు. మంగళవారం రాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో బొప్పన్న-ఎబ్డెన్(ఆస్ట్రేలియా) జంట 7-6(12-10), 6-1తో అమెరికాకు చెందిన లామన్స్-విత్రోలపై పోరాడి నెగ్గారు. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో పోరాడి నెగ్గిన బొప్పన్న జంట.. రెండో సెట్‌ను ఏకపక్షంగా చేజిక్కించుకొన్నారు. 5వ సీడ్‌గా బరిలోకి దిగిన ఇండో-ఆసీస్ జోడీ ఫ్రాన్స్‌కు చెందిన అన్‌సీడెడ్ మహట్-హెర్బెట్‌లతో తలపడనున్నారు. ఇక మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి చెక్ రిపబ్లిక్‌కు చెందిన 10వ సీడ్ కరోలినా ముఛోవా ప్రవేశించింది. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ముఛోవా 6-0, 6-3తో 30వ సీడ్ సిర్టీ(జర్మనీ)పై సునాయాసంగా నెగ్గింది.
జకో జోరు..

పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి 2వ సీడ్, సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్, అమెరికా సంచలనం షెల్టన్ ప్రవేశించారు. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో జకోవిచ్ 6-1, 6-4, 6-4తో అన్‌సీడెడ్ ఫ్రిట్జ్(అమెరికా)పై సునాయాసంగా గెలుపొందగా.. షెల్టన్ 6-2, 3-6, 7-6(9-7), 6-2తో సహచర ఆటగాడు, 10వ సీడ్ టఫీపై పోరాడి నెగ్గాడు. శుక్రవారం జరిగే సెమీస్‌లో షెల్టన్.. 2వ సీడ్ నొవాక్ జకోవిచ్‌తో తలపడనున్నాడు.










