Sep 11,2023 21:42
  • ఫైనల్లో మెద్వదెవ్‌పై గెలుపు
  • మార్గరేట్‌ కోర్ట్‌ రికార్డు సమం

న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను 2వ ర్యాంకర్‌, సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌ చేజిక్కించుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్లో జకోవిచ్‌ 6-3, 7-6(7-5), 6-3తేడాతో 3వ ర్యాంకర్‌, రష్యాకు చెందిన డానియెల్‌ మెద్వదెవ్‌ను ఓడించాడు. ఫైనల్‌ ఫోరు హోరాహోరీగా సాగుతుందని భావించినా.. వరుస సెట్లలోనే మెద్వదెవ్‌ను చిత్తుచేశాడు. తొలి సెట్‌ను 6-3తో చేజిక్కించుకున్న జకో.. రెండో సెట్‌లో మెద్వదెవ్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రెండోసెట్‌ 6-6తో సమంగా ఉన్న దశలో జకోవిచ్‌ టై బ్రేక్‌లో 7-5పాయింట్లతో ఆ సెట్‌నూ చేజిక్కించుకున్నాడు. నిర్ణయాత్మక మూడో సెట్‌లో రెండు బ్రేక్‌ పాయింట్లు సాధించి 6-3 తేడాతో ఆ సెట్‌నూ కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ సుమారు మూడు గంటల 17 నిమిషాల పాటు సాగింది. 2021 యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో జకోవిచ్‌.. మెద్వదెవ్‌ చేతిలో ఓటమిపాలవ్వడగా.. ఈసారి జకోవిచ్‌.. మెద్వదెవ్‌ను బోల్తా కొట్టించాడు. ఇక ఈ ఏడాది వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోకి దూసుకొచ్చిన జకో.. ఆస్ట్రేలియా ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, తాజా యుఎస్‌ ఓపెన్‌ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. వింబుల్డన్‌ ఫైనల్లో మాత్రం స్పెయిన్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. తాజా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో కలిపి జకోవిచ్‌ సాధించిన గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల సంఖ్య 24కు చేరింది. ఈ క్రమంలోనే 23 గ్రాండ్‌స్లామ్స్‌ టైటిళ్లతో పురుషుల విభాగంలో అగ్రస్థానంలో ఉన్న జకోవిచ్‌.. తాజాగా గ్రాండ్‌స్లామ్‌తో మహిళల విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన మార్గరేట్‌ కోర్ట్‌(24 గ్రాండ్‌స్లామ్స్‌) రికార్డును సమం చేశాడు. జకోవిచ్‌కు మూడు మిలియన్‌ డాలర్ల(రూ.25 కోట్లు), మెద్వదెవ్‌కు ఒకటిన్నర మిలియన్‌ డాలర్లు(రూ.12.5కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది.