డచ్‌వెల్లీ: మార్కెట్ పోటీతత్వం, స్వేచ్ఛా మార్కెట్ గురించి ఇతరులకు నీతులు చెప్పే అమెరికా తనవరకు వచ్చేసరికికి అవేవీ వర్తించవన్నట్టు వ్యవహరిస్తోంది. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) రంగంలో తనకు ప్రధాన పోటీదారుగా ఉన్న చైనాను దెబ్బతీసేందుకు రకరకాల ఆంక్షలు పెడుతోంది. వీటన్నిటిని అధిగమించి చైనా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. మధ్య ప్రాచ్య దేశాల్లో ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మార్కెట్‌లో చైనా ప్రవేశిస్తోంది. గత ఏడాది డిసెంబరులో చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సందర్భ34 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇందుకు గాను మధ్య ప్రాచ్య దేశాలపై అమెరికా ప్రతీకార చర్యలకు దిగింది. సూపర్ కంప్యూటర్ల మొదలు ఆధునిక కార్లు సెల్‌ఫోన్‌ల వరకు ప్రతిదానికి అవసరమైన చిన్న సిలికాన్ కార్డుల సరఫరాపై ఆంక్షలు విధించింది. ఈ చిప్‌లను తయారు చేసే సంస్థ నివిడియా గత వారం ఒక ప్రకటన చేస్తూ కొన్ని మధ్య ప్రాచ్య దేశాలకు ఈ చిప్‌ల ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించిందని తెలిపింది. అయితే ఆ దేశాల పేర్లను అది వెల్లడించలేదు.ఇది అమెరికా-చైనా మధ్య 'టెక్-వార్' కు ఒక సంకేతంగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ స్వరూపాన్నే మార్చేస్తున్న ఈ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) టెక్నాలజీ రంగంలో మొదట్లో కొంత కాలం అమెరికా ఈ రంగంలో ఆధిపత్యం సాధించేందుకు చైనాకు సూపర్ కంప్యూటర్ చిప్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ అందకుండా చేసేందుకు అనేక కుతంత్రాలకు పాల్పడింది. గత ఏడాది అమెరికా వాణిజ్య శాఖ ఒక ప్రకటన చేస్తూ చైనా, రష్యాలకు అత్యంత అధునాతన చిప్స్ ఎగుమతులపై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టులో మరి కొన్ని ఆంక్షలు విధించింది. ఇవి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అభివృద్ధి చేయడం చాలా కష్టం. అమెరికా కేంద్రంగా ఉన్న నివీడియా, మరి కొన్ని కంపెనీలు వీటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. చైనాకు దగ్గరగా మెలుగుతున్న ''ఇరాన్, సౌదీ అరేబియా, యుఎఇ దేశాలపై అమెరికా గుర్రుగా ఉంది. వాషింగ్టన్‌లోని అమెరికన్ యూనివర్సిటీలో యుఎస్ విదేశాంగ విధానాన్ని బోధించే ప్రొఫెసర్ జాన్ కాలాబ్రీస్ మధ్యప్రాచ్యంలో చైనా ఉనికి అమెరికా ఆధిపత్యానికి పెను సవాల్‌గా మారనుందని హెచ్చరించారు. చమురు సంపన్నమైన దేశాలైన ఇరాన్,సౌదీ అరేబియా, యుఎఇ, ఖతార్‌లు ఎఐపై ఎక్కువ ఖర్చు చేయగల సామర్థ్యం కలిగినవి. ఇజ్రాయిల్ కూడా ఎఐ రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతోంది. కాబట్టి మధ్యప్రాచ్యంలో విస్తారమైన మార్కెట్‌ను దక్కించుకోవడం కోసం ప్రపంచంలోని ప్రధాన చిప్‌మేకర్స్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. చైనా ఇప్పటికే ఈ దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకుని, సమాన భాగస్వాముల హౌదాలో ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు సాగుతోంది. చైనాకు చెందిన హ్యూవెయి వంటి కంపెనీలు ఇప్పటికే మద్య ప్రాచ్య మార్కెట్‌లో ప్రవేశించాయి.