Jul 06,2023 16:53

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో జూలై 4న ప్రారంభమైన కన్వర్‌ యాత్ర సందర్భంగా ముజఫర్‌ నగర్‌లోని మాంసం షాపులతోపాటు... యాత్ర మార్గంలోని అన్ని మాంసం దుకాణాలపై యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆపై చికెన్‌ షాపులు కనిపించకుండా నల్లటి టార్పాలిన్‌తో కప్పి, కనిపించకుండా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చికెన్‌ షాపులపై నిషేధం వరకే కాకుండా.. ముందస్తుగా శాంతి చర్చల పేరుతో ముస్లింలను పోలీస్‌ స్టేషన్‌కి పిలిపించి.. ఆ తర్వాత వారిని జైలుకి పంపేందుకు యోగి ప్రభుత్వం తలపెట్టింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. కన్వర్‌ యాత్ర జరుగుతున్న సందర్భంగా అక్కడ ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకూడదనే ఉద్దేశంతో పోలీసులు ముజఫర్‌ నగర్‌ జిల్లాలో 114 మంది ముస్లింలను శాంతి చర్చల కోసం స్థానిక పోలీస్‌ స్టేషన్లకు పిలించారు. ఆ తర్వాత క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సిఆర్‌పిసి) సెక్షన్‌ 151 (నేరాలను నిరోధించడం) కింద వారిని జైలుల్లో నిర్బంధించారు. పోలీసుల చర్యతో ఆ ప్రాంతంలోని ముస్లింలు గందరగోళానికి గురయ్యారు.
కాగా, మంగళవారం ప్రారంభమయ్యే ఈ యాత్రకు ముందే గత శనివారం కనీసం 90 మంది ముస్లింలను ముజఫర్‌నగర్‌లోని వేర్వేరు 18 పోలీస్‌ స్టేషన్‌లకు పిలిపించి.. వారిపై 151 సెక్షన్‌ కింద అదే రోజు వారిని జైల్లో పెట్టారు. ఆదివారం కూడా ఇదే తరహాలో మరో 24 మంది ముస్లింలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కన్వర్‌ యాత్రకు ముస్లింలు విఘాతం కలిగిస్తారనే ఉద్దేశంతోనే వారిని ముందస్తుగా అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. జంతువులను వధించకూడదని, శాంతికి భంగం వాటిల్లకుండా అరెస్టయినవారికి ఒకొక్కరికి లక్షరూపాయల చొప్పున బెయిల్‌ బాండ్‌ అందించారు. ఈ కేసులో ముస్లింల తరపున వాదించిన న్యాయవాది ముర్తజా రానా మీడియాతో మాట్లాడుతూ... పాలకులు 'చట్ట అధికారాన్ని దుర్వినియోగం చేశారు' అని అన్నారు. వీరు మాత్రమే కాదు ముజఫర్‌నగర్‌లోని మరో 500 మంది ముస్లింలను కూడా పరిపాలనా విభాగం గుర్తించిందని, వారిని కూడా అరెస్టు చేసే యోచనలో పోలీసులు ఉన్నారని రానా చెప్పారు.