ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా ఏకరూప పౌరస్మృతి (యుసిసి)పై చర్చ జరగాలని కోరుకుంటోందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్ శర్మ విమర్శించారు. 'యూనిఫాం సివిల్ కోడ్'పై శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సెమినార్ హాల్‌లో గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నానా పాట్లు పడుతున్నారని అన్నారు. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకరూప పౌర స్మృతి అమలు ఊసెత్తవద్దని 2015లో బిజెపి ప్రభుత్వం నియమించిన 21వ లా కమిషనే తేల్చిచెప్పిందని గుర్తు చేశారు. విభిన్న సంప్రదాయాలు, ఆచారాలున్న నేపథ్యంలో పౌరులందరికీ ఒకటే సివిల్ కోడ్ అమలు సాధ్యం కాదని చెప్పారు. ఆదేశ సూత్రాల్లో ఉందని యుసిసిపై చర్చ జరపమంటున్నారని, సమానత్వం, సామాజిక న్యాయం, అమలు మాటేమిటని ప్రశ్నించారు. దేశంలో పౌరుల మధ్య సమానత్వం అవసరమా, ఏకరూప పౌరస్మృతి అవసరమా? అని ప్రశ్నించారు. ఏ సమస్యలను చర్చించాలని ప్రజలు కోరుకుంటున్నారో కేంద్ర ప్రభుత్వ అజెండాలో అవి లేవని విమర్శించారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అమలైతే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్ నగరాలు కుప్పకూలిపోతాయని తెలిపారు. ఎపికి ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీ ఇవ్వని కేంద్ర ప్రభుత్వాన్ని వైసిపి, టిడిపి, జనసేన నిలదీయడానికి భయపడుతున్నాయన్నారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు వి.జి.కె మూర్తి అధ్యతన నిర్వహించిన కార్యక్రమంలో రేడియంట్ హెల్త్ కేర్ వైద్యులు డాక్టర్ అదీబ్ హసన్, యూనివర్సిటీ న్యాయ కళాశాల సీనియర్ అధ్యాపకులు డాక్టర్ వై.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










