Jul 28,2023 21:50

- మద్దతు ధర రూ.16 వేలు ప్రకటించాలి
ప్రజాశక్తి - పలాస (శ్రీకాకుళం జిల్లా):మద్దతు ధర కోసం జీడి రైతులు మూడు నెలలుగా పోరాడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారి గోడు పట్టడంలేదని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌ శర్మ అన్నారు. జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించాలని, రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద జీడి రైతు సంఘం ఆధ్వర్యాన 24 గంటల సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సుల అమలుకు ప్రభుత్వం నేటికి ముందుకు రావడంలేదన్నారు. జీడిపప్పుపై 12 శాతం జిఎస్‌టి, జీడి పిక్కలపై 5 నుంచి 2.5 శాతం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు వంటి విధానాలతో జీడి రైతులను నాశనం చేశారన్నారు. తక్షణమే విదేశీ జీడిపిక్కల దిగుమతులను ఆపాలని, జీడి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు భరోసానిచ్చే జీడి కార్పొరేషన్‌నుగానీ, బోర్డునుగానీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు జీడి పంట, రైతులకు మేలు చేసే విధానాలను అనుసరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. జీడి పిక్కల ధర పాతాళానికిపోతుంటే, పప్పు ధర ఆకాశాన్ని తాకుతోందని తెలిపారు. దీనికి ప్రభుత్వం కారణం కాదా? అని ప్రశ్నించారు. ఆర్‌బికెల ద్వారా అన్నీ కొనుగోలు చేస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం జీడిపిక్కలను ఎందుకు కొనడం లేదని నిలదీశారు. మద్దతు ధర లేక జీడి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా స్థానిక మంత్రి సీదిరి అప్పలరాజు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు చర్చించడం లేదనిప్రశ్నించారు. 80 కేజీల జీడి పిక్కల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర, ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. జీడి రైతుల సమస్యలపై పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలతో చర్చించి, శాసనమండలిలో ప్రస్తావిస్తామన్నారు. తొలుత అంబేద్కర్‌, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళుర్పించారు. జీడి రైతు సంఘం పతాకాన్ని మార్పు ట్రస్టు అధ్యక్షులు మట్ట ఖగేశ్వరరావు, రైతు ఉద్యమ సీనియర్‌ నాయకులు కె.కృష్ణారావు ఆవిష్కరించారు. దీక్షకు పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. జీడిరైతు సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన దీక్షలో ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, కె.హేమారావు చౌదరి, పి.కుసుమ, కె.బాలాజీరావు, కె.సింహాచలం, ఎ.రామకృష్ణ, కె.తవిటయ్య, ఎస్‌.ఈశ్వరరావు, ఎస్‌.కుమార్‌, జె.గవరయ్య, కె.గురయ్య కూర్చొన్నారు.