Jul 31,2023 10:48
  • 21వ లా కమిషన్‌ నివేదికపై నోరుమెదపదెందుకు
  • భిన్నంగా వుండే హిందువుల సాంప్రదాయాలను ఎలా ఏకతాటిపైకి తెస్తారు
  • 'సంగమం' సదస్సులో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ఏకరూప పౌర స్మృతి (యుసిసి)పై 21వ లా కమిషన్‌ సిఫార్సులను చర్చకు పెట్టకుండా, రాష్ట్రాలకు పంపకుండా తొక్కిపెట్టిన బిజెపికి యుసిసిపై మాట్లాడే అర్హత లేదని మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ విమర్శించారు. 21వ లా కమిషన్‌ సిఫార్సులపై తేల్చకుండా 2020లో మరో కమిషన్‌ వేసి, ఆ కమిషన్‌ గడువు పొడిగించడంలో ఆంతర్యమేమిటో తెలియనిది కాదని ఆయన అన్నారు. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సంగమం ఆధ్వర్యంలో యుసిసిపై సదస్సు జరిగింది. సంగమం కన్వీనర్‌ డాక్టర్‌ పరిమి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఎంవిఎస్‌ శర్మ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్ల కాలంలో ప్రజాసమస్యలను పరిష్కరించకుండా, చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, మైనార్టీల మీద విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఏదో ఒక అంశాన్ని ముందుకు తెస్తోందని విమర్శించారు. 20ఏళ్లపాటు రామమందిరం జపం చేసిన బిజెపి తర్వాత 370 ఆర్టికల్‌ అని, ఇప్పుడు యుసిసిని ముందుకు తెస్తోందని అన్నారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ దేశమంతా ఒక్కటే వుందని, కాని వ్యక్తిగత అంశాలకు సంబంధించిన వివాహం, విడాకులు, దత్తత, వారసత్వానికి సంబంధించి విభిన్న మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులు కలిగిన దేశంలో వేర్వేరుగా వున్నందున సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ వేరుగా వుందన్నారు. రాజ్యాంగంలో యుసిసి దిశగా నడవాలని చెప్పినా అందుకు దేశం సామాజికంగా, ఆర్థికంగా సమానత్వం సాధించాలని చెప్పిందనే అంశాన్ని బిజెపి ఉద్దేశపూర్వకంగా దాస్తోందన్నారు. దేశంలో భిన్న మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు వున్నాయని ముస్లిమ్‌లను అడ్డుపెట్టుకొని హిందువులను రాజకీయంగా గుప్పెట్లో పెట్టుకునేందుకు బిజెపి వేస్తున్న ఎత్తుగడ అని అన్నారు. హిందువులలో కూడా దక్షిణ భారతదేశం, ఉత్తర భారత దేశానికి సంబంధించి భిన్నమైన సంస్కృతులు వున్నాయని అన్నారు. దక్షిణ భారత దేశంలో బంధువుల మద్య మేనరిక వివాహాలు చేసుకునే సాంప్రదాయం వుంటే హర్యానాలో అది తప్పు అవుతుందన్నారు. అలాగే షెడ్యూల్‌ తెగల్లో బహుభార్యత్వం వుందని, అలాగే నాగాలాండ్‌లో మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు వుండవని తెలిపారు. గోవాలో యుసిసి వుందనే బిజెపి నాయకులు అక్కడా మహిళలకు 25 ఏళ్లలో పిల్లలు కలగకున్నా, 30 ఏళ్లలో మగబిడ్డకు జన్మనివ్వకున్నా భార్యకు విడాకులు ఇవ్వవచ్చు అనే చట్టం వుందనే అంశాన్ని తెలుసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు ప్రత్యేక హక్కులు వున్నాయని అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా నాన్‌లోకల్స్‌ భూములు కొనకూడదని చట్టం వుందని అన్నారు. బిజెపికి కావాల్సింది పూర్తిగా లౌకికతత్వంతో కూడిన యుసిసి కాదని, ఆ అంశంతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడమేనని అన్నారు. స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌లో వున్న బాల్యవివాహాల నిషేధం, వరకట్నం నిషేధం లాంటివి ఏమాత్రం పరిష్కారం అయ్యాయో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. హిందూ మహిళల పట్ల వివక్షను రూపుమాపేందుకు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సూచన మేరకు అంబేద్కర్‌ తీసుకొచ్చిన హిందూకోడ్‌ బిల్లును ఆరెస్సెస్‌, దాని రాజకీయ విభాగమైన జనసంఫ్‌ు తీవ్రంగా వ్యతిరేకించిందన్న అంశాన్ని మరువరాదన్నారు. వివాహం, విడాకులు, దత్తత, ఆస్తులకు సంబంధించిన అంశాలు మతం నుండి వేరుపడినప్పుడే యుసిసి సాధ్యమవుతుందన్నారు. నరేంద్రమోడి హయాంలో 2017లో వేసిన 21వ లా కమిషన్‌ అలాంటి సిఫార్సులు చేసినందునే దాన్ని పక్కన పెట్టి కాలయాపన చేసేందుకు 22వ లా కమిషన్‌ను వేసి 2024వరకు అంటే ఎన్నికలయ్యేదాకా గడువు పెట్టారని తెలిపారు. బిజెపి కుట్ర పూరిత వ్యవహారాలను ప్రజలకు వివరించాలని కోరారు. సంగమం ప్రతినిధులు బుడ్డిగ జమిందార్‌, విజయప్రకాష్‌ వేదికపై ఆసీనులయ్యారు.