Oct 31,2022 08:29

నాటకం ఒక సమాహార కళ. ప్రజల్ని ప్రభావితుల్ని చేసే ఒక శక్తివంతమైన సాధనం. అది జీవిత విమర్శ. సమాజంలో ప్రతిబింబించే మనుష్యుల మన్ణ ప్రవృత్తులను అడుగడుగునా మనకెదురుపడే సామాజిక సమస్యలను రంగస్థలంపై ప్రదర్శించటంవల్ల ప్రేక్షకులు వాటిని ప్రత్యక్షంగా చూడగల్గుతారు. శ్రవ్యం కంటే దృశ్యం ఎప్పుడూ గొప్పది. అందుకే 'నాటకాంతం హి సాహిత్యం' అంటారు సాహిత్య విమర్శకులు.
    హైదరాబాద్‌ అభ్యుదయ ఆర్ట్స్‌ అకాడమీ వారు అక్టోబర్‌ 22, 23 తేదీల్లో పెద్దాపురం లూథరన్‌ హైస్కూల్‌ షఆడిటోరియంలో రెండు అద్భుతమైన సాంఘిక నాటకాలను హృదయాలకు బలంగా హత్తుకొనేలా ప్రదర్శించారు. బడుగుల ఆశాజీవి డా.అంబేద్కర్‌ జీవిత విశేషాలతో 'సంఘం శరణం గచ్చామి', నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం జీవిత విశేషాలతో 'సంస్కరణోద్యమ ఖడ్గధారి కందుకూరి' నృత్యరూపకాల్ని ప్రదర్శించారు.
మహనీయుల చరిత్ర ఒక్క భారతదేశానికే కాదు, యావత్ప్రపంచానికీ ఆదర్శమవుతుంది. అత్యుత్తమ నీతిబోధకమై ప్రపంచశాంతికే మార్గదర్శకమవుతుంది. అందుకే పెద్దాపురంలోని వివిధ ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ ఇరువురు మహనీయుల జీవిత చరిత్రల్ని నృత్యనాటకాలుగా ప్రదర్శించారు. రెండు రోజులూ కూడా నాటక ప్రారంభానికి ముందు ప్రజానాట్యమండలి వారు ఉత్తేజపూరితమైన గేయాలను ఆలపించారు. ఆవిధంగా ప్రదర్శింపబోయే నాటకాలకు ముందే ఒక మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. ప్రేక్షకులను నాటకోన్ముఖులను గావించారు. తొలిరోజు ముందుగా అంబేద్కర్‌ చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి నివాళులర్పించి నాటకాన్ని ప్రారంభించారు.
         అంబేద్కర్‌ గురించి మనం చాలా విని ఉంటాం. ఎన్నో చదివి ఉంటాం. కాని అవి వేరు. ఈ నృత్య రూపకాన్ని చూసి తీరాల్సిందే. ఒకపక్క ఉత్తేజపూరితమైన గేయాలతో, మరొకపక్క నృత్యాభినయ పూర్వక సంభాషణలతో నాటకాన్ని భలే రక్తి కట్టించారు. అంబేద్కర్‌ పుట్టుక దగ్గరనుంచి చివరిదాకా ఆయన జీవితంలో ఎదురయ్యే అనేకానేక సంఘటనల్ని ఎక్కడా ఊపిరి తీసుకోనీయనంతటి వేగంతో నాటకాన్ని పరుగులు పెట్టించారు. ఒకదాని తరువాత మరొకటిగా సన్నివేశాలను చాలా కనెక్టివ్‌గా ప్రదర్శిస్తూ వచ్చారు. ఎక్కడా విసుగనిపించదు. అర్థం కాకపోవటం ఉండదు. కన్నుమూసి తెరిస్తే మధ్యలో ఏం మిస్‌ అయిపోతామో అన్నంత ఉత్కంఠను ప్రదర్శనలో మనం చూస్తాం. సురభి వాళ్ళు మంచిమంచి సెట్టింగ్‌లతో నాటకాల్ని ఎంత అద్భుతంగా ప్రదర్శిస్తారో, తమకున్న వనరులతోనే అంత గొప్పగా రెండు నాటకాల్నీ కూడా వీరు ప్రదర్శించారు.
          అంబేద్కర్‌ అనగానే చాలామందికి ఆయన రాజ్యాంగ నిర్మాత, బడుగులకు రిజర్వేషన్లు కల్పించిన సంస్కర్త అని మాత్రమే అనుకుంటారు. కానీ, ఆయనలోని అనేక కోణాలను ఈ నాటకం ప్రదర్శించింది. ఆయన కొందరి వాడు కాదు, అందరివాడు అని ఢంకా బజాయించి మరీ చెప్పింది. బాల్యంలో పాఠశాల నుంచి అంబేద్కర్‌ ఎదుర్కొన్న వివక్ష, పట్టుదలతో ఆతడు సాధించిన బిఏ., ఎంఏ (ఎకనామిక్స్‌) డిగ్రీలు, బారిష్టరు చదువు మధ్యలో ఆగిపోవటం, చదువు కోసం భార్య రమాబాయి పడ్డ కష్టాలు, అనారోగ్యంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకును పేదరికం వల్ల రక్షించుకోలేని దుస్థితి ... ఈనాటకంలో చాలా ఆర్ద్రంగా గుండెలకు హత్తుకు పోయేటట్లు ప్రదర్శించారు.
          బడుగుల అభ్యున్నతి కోసం అంబేద్కర్‌ చేసిన పోరాటాలను కళ్లకు కట్టించారు. నీటి హక్కుకై మహద్‌లోని 'చౌదర్‌ చెరువు' వద్ద పోరాటం.. వేలాదిమంది దళితులతో కలిసి చెరువునీరు తాగటం... దేవాలయ ప్రవేశం కోసం పోరాటం.., సత్యాగ్రహం ప్రకటించటం... దళితుల హక్కులను నేలరాసే మనుస్మ ృతిని దహించటం... గాంధీజీతో కొన్ని అంశాలలో విభేదించటం, ఆయన ప్రాణాలను కాపాడటానికి తప్పని పరిస్థితుల్లో పూనా ఒప్పందానికి సిద్ధపడాల్సి రావటం... తరతరాలుగా తన జాతి ప్రజలు అనుభవించిన వివక్ష కారణంగా అంబేద్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించటం... స్త్రీలకు పురుషులతో సమానంగా హక్కుల కోసం, సమానవేతనం కోసం, మెటర్నిటీ లీవుకోసం, ఉమెన్‌ ఛైల్డ్‌ లేబర్‌ చట్టాలను పటిష్ట పరచటంకోసం... ఎటువంటి కృషి చేసాడో ఈ నృత్యరూపకం ద్వారా కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించారు. నాటక రచయిత దేవేందర్‌తో పాటు దర్శకులు, ప్రదర్శకులూ ఈ విషయంలో నూరుశాతం సఫలీకృతులయ్యారనే చెప్పాలి.
          రెండవరోజు 'సంస్కరణోద్యమ ఖడ్గధారి కందుకూరి' అనే నృత్య రూపకాన్ని ప్రదర్శించటానికి ముందు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ సూరిబాబు రాజు కందుకూరి చిత్రపటాన్ని పుష్పమాలతో అలంకరించి నివాళులర్పించారు. ప్రదర్శనలో ముందుగా ఆ రోజుల్లో బ్రాహ్మణుల ఇళ్ళల్లో కనిపించే విపరీతమైన మూఢాచారాలను నిరసించే రెండు మూడు ప్రహసనాలను ప్రదర్శించారు. అవి హాస్యప్రధానంగా ఉండటమే కాక ఆనాటి విపరీత ధోరణుల్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించాయి.
      ఇక 'వేదంలా ఘోషించే గోదావరీ! అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రీ..' అన్న ఆరుద్ర గీతంతో కందుకూరి నృత్య రూపకం ప్రారంభమైంది. కందుకూరి జనన విద్యాభ్యాసాల నుంచి మొదలుపెట్టి ఆయన జీవితంలోని అనేక ఘట్టాలను రూపకంలో ప్రదర్శించారు. జీవితమంతా జీవిత భాగస్వామి రాజ్యలక్ష్మితోపాటు, స్త్రీవిద్య కోసం, స్త్రీ పునర్వివాహం కోసం, స్త్రీ జన సముద్ధరణ కోసం, సాంఘిక దురాచారాలైన బాల్య వివాహాలు, వృద్ధవివాహాల నిర్మూలన కోసం ఆయన అహరహం శ్రమించిన అంశాలనన్నిటినీ ఒక క్రమపద్ధతిలో ప్రదర్శించి చూపారు. జ్యోతిషం, చేతబడులు, దెయ్యాలు, పూనకాలు, అంజనం వెయ్యటాలు వంటి వాటిలోని అశాస్త్రీయతను, అడుగడుగునా ఎదిరించి నిలిచిన నవయుగ వైతాళికునిగా కందుకూరి స్థానం ఎటువంటిదో ఈ నాటకంలో నిరూపించారు. చివరకు..
తన దేహము, తన గేహము,
తన కాలము తన ధనమ్ము తన విద్య జగ
జ్జనులకు వినియోగించిన
ఘనుడీ వీరేశలింగకవి జనులారా..!

అన్న అంశాన్ని ఈ నృత్య రూపకం ద్వారా అందరికీ అర్ధమయ్యేటట్లు వివరించారు. ఎమ్మెల్యే చినరాజప్ప, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ సూరిబాబు రాజుతో సహా వచ్చిన అతిథులు, ప్రేక్షకులూ మొత్తం పూర్తి అయేదాకా రెండు నాటకాల్నీ కదలకుండా చూశారు. ''శరీరాలు కుర్చీలకు, మెదళ్ళు నాటకానికి అతుక్కొని పోయాయి.'' ఇది అక్షరాలా ఒకానొక ప్రేక్షకుని నోటి నుంచి వెలువడిన మాట! చివరిలో నాయకులు నాటకాలపై తమ అమూల్య అభిప్రాయాలను పంచుకొన్నారు కూడా.
         ఇక నాటక ప్రదర్శనలో దర్శకుల, నటుల, ప్రదర్శకుల టీమ్‌ వర్క్‌ ప్రశంసనీయం. ఎక్కడా తడబాటు కనిపించదు. ప్రదర్శనలో చిన్న గేప్‌ కూడా ఉండదు. చిన్నా పెద్దా, ఆడా మగా అనే తేడా లేకుండా మొత్తం నటులందరూ ఒక దాని తరువాత ఒకటిగా సన్నివేశాలను వేగంగా ప్రదర్శించుకొంటూ పోయారు. ఇవి రికార్డెడ్‌ నాటకాలు. ఈ విషయం చెపితే గాని కనుక్కోలేం. డైలాగులకు, నటుల అభినయానికి ఒక్క ఇంచి కూడా తేడా రాకుండా నటించారు. నాటకాలు పూర్తయి ఇంటికి వెళ్ళిపోయాక కూడా అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఈ నాటకాలను రచించిన దేవేందర్‌కి, దర్శకత్వం వహించిన దర్శకులు డాక్టర్‌ తూము శివప్రసాద్‌, ఎం.జగ్గరాజులకు, నాటకాల్ని ఆసాంతం కన్నుల పండువుగా దృశ్యమానం చేసిన నటీనటులకు అభినందనలు.

- డాక్టర్‌ జోస్యుల కృష్ణబాబు,
98664 54340