- సరైన వ్యక్తి దొరికితే వదిలేస్తా : ఎలన్ మస్క్ వెల్లడి
వాషింగ్టన్ : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను నడపడం ఎలన్ మస్క్‌తో కావడం లేదని సంకేతాలు వస్తోన్నాయి. ఆ విషయం ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ మాటల్లోనే స్పష్టమయ్యింది. సరైన వ్యక్తి దొరికితే సంస్థను అమ్మేస్తానని బిబిసికి ఇచ్చిన ఇంటర్యూలో మస్క్ పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. గతేడాది ఈ సంస్థను 44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.5 లక్షల కోట్లు)కు మస్క్ కొనుగోలు చేశారు. కొనుగోలు అనంతరం ఆయన అనుభవాలను బిబిసితో పంచుకున్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసినందుకు తానేమీ బాధపడటం లేదన్నారు. '' గత కొన్ని నెలలుగా చాలా ఒత్తిడితో కూడుకున్న పరిస్థితి. పనిభారం సవాల్‌గా ఉంది. ఆఫీసులో నిద్రపోవాల్సి వస్తుంది.'' అని మస్క్ పేర్కొన్నారు.
- ఎక్స్ లో విలీనం
ఎక్స్ అనే ఎవ్రీతింగ్ యాప్‌లో ట్విట్టర్‌ను కలిపేసినట్టు ఆ సంస్థ మంగళవారం తెలిపింది. ప్రస్తుతం ట్విట్టర్ సంస్థ స్వతంత్ర కంపెనీగా మనుగడలో లేదంటూ ఓ కేసు నిమిత్తం కోర్టుకు సమర్పించిన సమాచారంలో మస్క్ స్పష్టం చేశారు. తాను ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తే తన ఎక్స్‌లో కలిపేస్తానని మాస్క్ ఐదేళ్ల క్రితమే తెలిపారు. తాజాగా ఈ పరిణామాన్ని ధృవీకరిస్తూ తాజాగా ఎలాన్ మస్క్ 'ఎక్స్' అనే అక్షరాన్ని ట్వీట్ చేశారు. ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత సగం మంది పైగా ఉద్యోగులను మస్క్ తొలగించారు. నిర్వహణలో అనేక మార్పులు చేపట్టారు.










